Sarada Peetham: ఏపీ రాజకీయాలకు ఇక చంద్రబాబే పెద్ద దిక్కన్న విశాఖ శారాదా పీఠాధిపతి స్వరూపానంద-visakha swarupananda says chandrababu guide for ap politics ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sarada Peetham: ఏపీ రాజకీయాలకు ఇక చంద్రబాబే పెద్ద దిక్కన్న విశాఖ శారాదా పీఠాధిపతి స్వరూపానంద

Sarada Peetham: ఏపీ రాజకీయాలకు ఇక చంద్రబాబే పెద్ద దిక్కన్న విశాఖ శారాదా పీఠాధిపతి స్వరూపానంద

Sarath chandra.B HT Telugu

Sarada Peetham: ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు ఇకపై చంద్రబాబు నాయుడు పెద్దదిక్కని చెప్పుకొచ్చారు.

రాజశ్యామల యాగంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో ముఖ్యమంత్రి సీఎం జగన్ (ఫైల్ ఫోటో) (Twitter )

Sarada Peetham: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానని చెప్పారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని ఎవరు భావించొద్దన్నారు.

క్లిష్ట పరిస్థతుల్లో ఉన్న ఏపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో తమ పీఠానికి స్థలం ఉందని, అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారి కృపతో మూడో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, కేదారనాథ్‌,హరిద్వార్‌తో సహా ఉత్తర భారత దేశాన్ని మోడీ బాగా అభివృద్ధి చేశారన్నారు.

త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి లభించడం సంతోషకరమని, శ్రీ మహా లగ్నంలో 11.25 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇది శుభ లగ్నమన్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి అశీస్సులు ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ది చెందాలని కోరుతున్నట్లు చెప్పారు.

వద్దన్నా కుంభాభిషేకం చేసినందుకే…

శ్రీశైలంలో మాఘమాసంలో కుంభాభిషేకం వద్దని గతంలో ప్రభుత్వానికి లేఖ రాసినా వినలేదని ఫలితం ఏం జరిగిందో చూశారన్నారు. స్వరూపానందేంద్రది ప్రభుత్వాలపై బ్రతికే పీఠం కాదని, ఎప్పుడూ ప్రజల పక్షాన శారదా పీఠం ఉంటుందన్నారు.

గతంలో చంద్రబాబు హయాంలో మురళీమోహన్ గెలవాలని రాజమండ్రిలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించినట్టు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దిక్కు చంద్రబాబు అని, బాబు హయాంలో టీటీడీ అభివృద్ధి జరగుతుందన్నారు.

ఎరుక కంటే మరుపు ఎక్కువ, ఎందరో మంత్రులు, గవర్నర్ లు పీఠానికి వచ్చారని వైయస్సార్ సీపీ మంత్రులు మాత్రమే రాలేదన్నారు. ఇది ధర్మం కోసం పని చేస్తున్న పీఠమని, చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దన్నారు.

చంద్రబాబు గెలవాలని గతంలో మురళీమోహన్ తో కలిసి సాధువులందరితో కలిసి సమావేశం నిర్వహించి పూజలు చేశామన్నారు. ఎవరికి భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదని, తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ప్రెస్ మీట్ పెడుతున్నట్టు చెప్పారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, ఆయన సీనియర్ నేత అన, ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఈ సారైనా దేవాలయాల పాలన బాగుండాలని స్వరూపానంద అకాంక్ష వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలో ఉండగా విశాఖ శారదాపీఠానికి భూముల కేటాయింపు, భవన నిర్మాణ అనుమతులు వివాదాస్పదం అయ్యాయి. శారదాపీఠానికి ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సమయంలో వైసీపీ అధ్యక్షుడు విశాఖలో పర్యటించాలని భావించినా చివరి నిమిషంలో రద్దైంది. వైసీపీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన విశాఖ పీఠాధిపతి ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన వెంటనే చంద్రబాాబుపై పొగడ్తలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలొో రాజశ్యామల యాగం నిర్వహణ ద్వారా అయా పార్టీల ప్రభుత్వాలను ఏర్పాటులో దైవ అనుగ్రహం లభించేలా కృషి చేస్తారని శారదా పీఠానికి గుర్తింపు ఉంది. గత ఏడాది కూడా ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ ద్వారా విజయవాడలో స్వరూపానంద జగన్ తరపున భారీ ఎత్తున యాగాన్ని నిర్వహించారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ స్వయంగా రాజ శ్యామల యాగాన్ని నిర్వహించారు.

సంబంధిత కథనం