Visakha Crime : వివాహితకి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన జైలర్, స్నేహం పేరుతో ఛాటింగ్ ప్రారంభించాడు. ఆపై న్యూడ్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్‌లతో ఆ వివాహితని జైలర్ వేధిస్తున్నాడు. వివాహిత కుటుంబ సభ్యులు హెచ్చరించిన తరువాత కొన్ని రోజులు ఆపేసి, మళ్లీ వేధింపులకు దిగాడు. తనకు న్యూడ్ కాల్స్ చేస్తే డబ్బులు ఇస్తానని అసభ్యకరంగా వేధించడంతో ఆ వివాహిత విశాఖ పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా, జైలర్ పరారయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న వివాహిత ఫేస్‌బుక్ అకౌంట్‌కు అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అందులో తాను జైలర్‌గా ఉద్యోగం చేస్తున్నానని సుబ్బారెడ్డి పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించింది. దీంతో స్నేహం పేరుతో ఛాటింగ్ ప్రారంభించాడు. అలాగే కొన్ని రోజుల తరువాత తన అసలు రంగును బయటపడింది. న్యూడ్ కాల్స్ చేస్తూ, అసభ్యకరమైన మెసేజ్ పంపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు.
దీంతో మహిళ తీవ్ర మనస్తాపనకు లోనైంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లింది. అయితే జైలర్ సుబ్బారెడ్డి వేధింపులు ఎక్కువ అవ్వడంతో భరించలేకపోయింది. దీంతో వివాహిత తన కుటుంబ సభ్యులకు చెప్పాలని నిర్ణయించింది. ఎస్ఐగా ఉన్న భర్తకు, ఏసీపీగా ఉన్న బంధువుకు విషయం చెప్పి తాను మనోవేదనను వివరించింది. దీంతో వారు జైలర్‌కు ఎస్ఐ, ఏసీపీ ఫోన్ చేసి హెచ్చరించారు. దీనికి సుబ్బారెడ్డి తాను కేవలం ఫ్రెండ్‌షిప్ కోసమే మెసేజ్‌లు పంపించానని, జరిగిన తప్పుకు క్షమించాలని అన్నాడు.
ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఆ వివాహిత మహిళకు ఎటువంటి మెసేజ్‌లు పంపించలేదు. తాజాగా గత నెల 25వ తేదీ నుంచి మెసేజ్‌లు, కాల్స్ చేయడం మళ్లీ ప్రారంభించాడు. జైలర్ సుబ్బారెడ్డి వేధింపులు తాళలేక వివాహిత విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీకి ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు కేసును అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. అయితే జైలర్ వేధింపులు నిజమని తేలడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా, అప్పటికే జైలర్ సుబ్బారెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆ తరువాత విశాఖపట్నం వచ్చి ఐదో అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి (ఏడీజే) ఫ్యామిలీ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖపట్నం పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు. అయితే ఇదిలా ఉండగా జైలర్ సుబ్బారెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ లేఖ రాశారు. సుబ్బారెడ్డి తీసుకున్న ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం