Wife Killed Husband: వైరల్ వీడియో.. కర్రతో కొట్టి, భర్తను ఉరేసి చంపేసిన భార్య.. అడ్డుకోకుండా వినోదం చూసిన జనం
Wife Killed Husband: బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై దారుణ హత్య జరుగుతున్నా జనం వినోదం చూశారు. ఓ మహిళ భర్తను కిరాతకంగా హతమారుస్తున్నా చూస్తూ ఉండిపోయారు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దారుణమైన ఈ ఘటన నిజాంపట్నంలో జరిగింది.
Wife Killed Husband: బాపట్ల జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచేలా నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. మద్యానికి బానిసై భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేక తిరగబడిన మహిళ నడిరోడ్డుపై ఉరి వేసి చంపేసింది. ఈ ఘటనను చుట్టు పక్కల వాళ్లు చూస్తూ ఉండిపోయారు. ఎవరు ఆమెను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఓ వ్యక్తి వారి దగ్గర నిలబడి వీడియో రికార్డ్ చేశాడు. మరికొందరు ఆమె పక్క నుంచి ద్విచక్ర వాహనాలపై వెళ్లిపోయారు. ఏ ఒక్కరు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
నిజాంపట్నంలో నడిరోడ్డుపై జరిగిన హత్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాగి వేధిస్తున్న భర్తపై దాడి చేసిన మహిళ, వీధిలోకి లాక్కొచ్చి తాడుతో ఉరి వేసి చంపేసింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా గురువారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మొదట కర్రతో కొట్టి చంపేసినట్టు పోలీసులు భావించినా వీడియో వెలుగు చూసిన తర్వాత అవాక్కయ్యారు.
బాపట్ల జిల్లా అడవుల దీవి పోలీసు స్టేషను పరిధిలోని కొత్త పాలెం గ్రామానికి చెందిన అరుణతో గోకర్ణ మఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమరేంద్ర బాబు మద్యానికి బానిసగా మారివ కుటుంబ పోషణ పట్టించుకోవడం లేదు. నిత్యం భార్య అరుణను వేధింపులకు గురి చేసేవాడని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలు మార్లు పంచాయితీలు జరిగినా అమరేంద్రబాబు తీరులో మార్పు రాకపోగా, వేధింపులు మరింత పెరిగాయి.
భర్త వేధింపులు తట్టుకోలేక అరుణ కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో డిసెంబర్ 31న భార్యను ఇంటికి రావాలని అడిగేందుకు అత్త వారింటికి వెళ్లాడు. అక్కడ అమరేంద్ర బాబు, అరుణల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భర్త కత్తి తీసుకుని రావడంతో అరుణ భర్తపై కర్రతో తీవ్రంగా దాడి చేసింది. తీవ్ర గాయాలై కింద పడి ఉన్న భర్తను రోడ్డుపైకి లాక్కుని వచ్చి తాడుతో ఉరి బిగించింది. దాదాపు పది నిమిషాల పాటు ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. హత్యకు మృతుడి అత్త, బామ్మర్ది సహకరించారని గ్రామస్తులు చెబుతున్నారు.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అరుణ తన భర్తను కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను కర్రతో కొట్టిన తర్వాత కూడా అరుణ కోపం చల్లారని అరుణ అమరేంద్రను నడి రోడ్డుపైకి లాక్కొచ్చి ఉరివేసింది. మెడపై కాలువేసి అదిమిపట్టింది. ఉన్మాదంగా ప్రవర్తించినట్టు ఉన్న వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. వైరల్ అయిన వీడియో దృశ్యాల ఆధారంగా కేసులో సెక్షన్ల నమోదుపై పోలీసులు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. నిందితురాలు అరుణ పరారీలో ఉందని ఆమె కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తున్నట్టు బాపట్ల జిల్లా పోలీసులు తెలిపారు.