Vijayawada: ఇంద్రకీలాద్రిపై వారంలో మూడు రోజులు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు-vip and vvip darshan in vijayawada indrakeeladri cancelled for three days in a week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada: ఇంద్రకీలాద్రిపై వారంలో మూడు రోజులు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు

Vijayawada: ఇంద్రకీలాద్రిపై వారంలో మూడు రోజులు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 03:33 PM IST

Vijayawada: ఇంద్రకీలాద్రిపై వారంలో మూడు రోజులు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. ఈ మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయమ
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయమ

విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రత్యేకంగా శుక్ర, శని, ఆది, ఇతర ప్రత్యేక రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి పొటెత్తుతున్నారు. అమ్మవారి మహా నివేదన నిమిత్తం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అన్ని క్యూ లైన్లు దర్శనాన్ని నిలిపేస్తున్నారు. ఈ సమయంలో సుమారు గంట సేపు భక్తులు లైన్లలోనే వేచి ఉంటున్నారు. దీంతో భక్తుల దర్శనం పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది.

ఆ సమయంలో వీఐపీలు అమ్మవారి దర్శనానికి వస్తే భక్తులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. దీంతో శుక్ర, శని, ఆది వారాలు, ఇతర ప్రత్యేక రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీవీఐపీలు, వీఐపీలు దర్శనాన్ని నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

సహస్రదీపాలంకార సేవలు రద్దు..

ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాఢ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

27న గోకులాష్టమి..

తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని.. ఆగస్టు 27న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు.

27న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి..

టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో ఆగష్టు 27న గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోకుల నందనుడు, బృందావన విహారి, ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టీటీడీ.. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది.

గోకులాష్టమి సందర్భంగా.. ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వేణుగానం, తిరుమల వేద పాఠశాల విద్యార్థులతో వేదపారాయణం, టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ వేణుగోపాలస్వామి వారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )