Vinfast In AP: ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి…చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ-vin fast interest in 4000 crore investments in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vinfast In Ap: ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి…చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ

Vinfast In AP: ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి…చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ

Sarath chandra.B HT Telugu
Published Jul 11, 2024 06:52 AM IST

Vinfast In AP: ఎలక్ట్రిక్ వాహ‍నాల తయారీలో పేరొందిన వియత్నంకు చెందిన విన్‌ఫాస్ట్‌ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది.

విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులతో ఏపీ సిఎం చంద్రబాబు
విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులతో ఏపీ సిఎం చంద్రబాబు

Vinfast In AP: ప్ర‌పంచంలో విద్యుత్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్ర బాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిథులు స‌మావేశ‌మయ్యారు.

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారు. వియత్నాంలో ఎంతో పేరుగాంచిన ఈ సంస్థ ఏపీలో రూ. 4 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించిన‌ట్లు మంత్రి భరత్ తెలిపారు.

ఉమ్మడి క‌ర్నూలు జిల్లా ఓర్వ‌కల్లులో కానీ క్రిష్ణ‌ప‌ట్నంలో కానీ ఎల‌క్ట్రానికి వెహిక‌ల్‌, బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను పెట్టే అవ‌కాశాలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అన్నివిధాలా అవ‌స‌ర‌మైన భూమి, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు చంద్రబాబు విన్‌ఫాస్ట్ ప్రతినిధులకు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.

30 రోజుల తర్వాత రాయితీలపై చర్చించి, అన్నీ అనుకూలిస్తే కంపెనీ ఎక్క‌డ ఏర్పాటుచేసే విషయం తెలుస్తుంద‌న్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పారిశ్రామికవేత్తలు ఏపీకి తరలి వస్తున్నారని మంత్రి భరత్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు.

ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు వారిని కోరారు. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకరిస్తామని...పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కోరారు. అంత‌కుముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విన్‌ఫాస్ట్‌ కంపెనీ ప్ర‌తినిధుల‌కు విందు ఇచ్చారు.

ఏపీలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ…

ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబు తన డిల్లీ పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు బిపీసీఎల్ ప్రతినిథులతో భేటీ అయ్యారు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిథులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

రిఫైనరీ ఏర్పాటుకు అససరమైన భూములు కేటాయిస్తామని...90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని బిపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

Whats_app_banner