Ambedkar Smruti vanam: విజయవాడ నడిబొడ్డున ఏడాది క్రితం ప్రారంభించిన 206 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ నిర్వహణ భారంగా మారడంతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. సామాజిక న్యాయ శిల్పం పేరిట వైసీపీ హయంలో రూ.400కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది జనవరిలో జగన్ విగ్రహావిష్కరణ చేయగా ఈ ఏడాది అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు.
అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రతిపాదనల్ని గత డిసెంబర్‌లోనే హెచ్‌టి వెలుగులోకి తెచ్చింది. ప్రతి నెల రూ.21లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో విగ్రహ నిర్వహణ భారాన్ని వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిని అప్పట్లో జిల్లా యంత్రాంగం ఖండించింది.
అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం పేరుతో 2024 జనవరిలో సార్వత్రిక ఎన్నికలకు ముందు.. విజయవాడలో 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో 125 అడుగుల విగ్రహాన్ని 80 అడుగుల ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేశారు.
19ఎకరాల స్వరాజ్యమైదానంలో భారీ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా రాజకీయంగా లబ్ది కలుగుతుందని వైసీపీ భావించింది. రూ.200కోట్ల అంచనాలతో చేపట్టిన పనులు చివరకు రూ.400కోట్లకు పెరిగిపోయాయి. తెలంగాణలో అందులో సగం ఖర్చుతోనే అన్ని పనుల్ని పూర్తి చేశారు. ఏపీలో ఖర్చు అంచనాలను మించిపోయినా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలేదు. కొందరు ఐఏఎస్ అధికారులు విగ్రహ నిర్మాణంలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నా దానిపై కూటమి ప్రభుత్వంలో ఎలాంటి విచారణ చేయలేదు.
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు స్మృతివనం నిర్వహణకు ప్రతి నెల రూ.21లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత డబ్బును వెచ్చించడం తమకు భారం అవుతోందని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం భావిస్తున్నాయి. విగ్రహ సందర్శన, ఎంట్రీల కోసం వసూలు చేస్తున్న ఫీజులతో నెలకు రూ.ఐదారు లక్షలు కూడా ఆదాయం రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఎలా వదిలించుకోవాలనే యోచనలో ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. దీనికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఉంది.
విజయవాడ నగరం మధ్యలో సువిశాలమైన స్థలంతో పాటు పార్కింగ్ సదుపాయాలతో ఉన్న ప్రాంగణాన్ని విదేశీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అవసరమైన డిజైన్లను కూడా రూపొందించారు.
ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు కోట్లాది రుపాయల్ని ప్రైవేట్ హోటళ్లకు చెల్లిస్తున్నారు. విజయవాడలో నిర్మిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కలిసొచ్చే అవకాశం కూడా ఉంటుంది
అంబేడ్కర్ పార్క్‌లో ఆడిటోరియం, మ్యూజియం, కాన్ఫరెన్స్ హాళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈ హాళ్లను ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
విజయవాడ అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ పద్ధతిలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా రెండు రోజుల క్రితం ప్రకటించారు. స్మృతి వనం నిర్వహణకు త్వరలో టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. కలెక్టర్ ప్రకటనపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్మృతి వనం ప్రాజెక్టును పూర్తి చేయకుండా పీపీపీ ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడాన్ని కేవీపీఎస్ తప్పు పట్టింది.
ప్రభుత్వం నిధులు కేటాయించి అంబేడ్సర్ స్మృతివనంలో ఆడిటోరియం, వాణిజ్య సముదాయం, బుక్స్ స్టోర్, లైబ్రరీ ఫుడ్ కోర్టు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు.
ప్రభుత్వ ఆస్థిని ప్రైవేటువారికి అప్పజెప్పటమంటే స్మృతివనాన్ని పూర్తిగా కమర్షియల్ ప్రయోజనాలకు ఉపయోగించటమే అవుతుంది. ప్రజలకుపయోగపడే స్మృతివనాన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన సరైందికాదు. వెంటనే అటువంటి ఆలోచన విరమించుకోవాలని కోరారు.
అంబేద్కర్ స్మృతివనం నిర్వహణ కోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయవాడలో 125 అడుగుల సామాజిక న్యాయ శిల్పం వద్ద ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించక పోవడంపై ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు.
సంబంధిత కథనం