విజయవాడ బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్-విశాఖపట్నం మధ్య విజయవాడ మీదుగా రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే విజయవాడ నుంచి బెంగుళూరుకు మరో సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
విజయ వాడ-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. విజయవాడ నుంచి బెంగుళూరు వైపు పరిమిత సంఖ్యలో రైళ్లు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.విజయవాడ నుంచి ప్రస్తుతం యశ్వంతపూర్ రైలు మాత్రమే బెంగుళూరుకు ఉంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ మార్గంలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కొత్త రైలును తిరుపతి మీదగా బెంగుళూరుకు నడుపుతారు.
వందేభారత్ సిరీస్ రైళ్లు మొదలైన తర్వాత విజయవాడ- బెంగుళూరు మధ్య కొత్త రైలును ప్రారంభించాలని స్థానిక ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. తొలి దశలో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మొదటి రైలు ప్రారంభమైంది. ఆ తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్‌కు మరో వందే భారత్ ప్రారంభించారు. రెండు రైళ్లు ఏకకాలంలో విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గమ్య స్థానాలకు బయల్దేరుతున్నాయి.
ఇకపై బెంగుళూరుకు వందే భారత్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి బెంగుళూరుకు ప్రస్తుతం ప్రయాణ సమయం 12 గంటలకు పైగా పడుతోంది. వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే తొమ్మిది గంటల్లోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
వందే భారత్ రైలుతో బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు కూడా అనువుగా ఉంటుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌తో ఈ సర్వీస్ నడుపుతారు. వారంలో మంగ ళవారం మినహా ఆరు రోజులు నడిచేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
ట్రైన్ నంబర్ 20711 విజయవాడ- బెంగుళూరు వందే భారత్ విజయవాడలో ఉదయం 5.15 బయలుదేరి తెనాలి 5.39కు చేరుతుంది. ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి, 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్యాహ్నం 14.15 గంటలకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో అదే రోజు ట్రైన్ నంబర్ 20712 బెంగ ళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభం అవుతుంది. కృష్ణరాజపురం మధ్యాహ్నం 2.58,కాట్పాడి 5.23, చిత్తూరు సాయంత్రం 5.49, తిరుపతి 6.55, నెల్లూరుకు రాత్రి 8.18, ఒంగోలుకు రాత్రి 9.29, తెనాలి రాత్రి 10.42, విజయవాడ 11.45కు చేరుతుంది.
ప్రస్తుతం విజయవాడ మీదుగా మచిలీపట్నం-యశ్వంతపూర్ రైలు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. వందే భారత్ అందుబాటులోకి వస్తే బెంగుళూరులో ఉద్యోగాలు చేసే ఐటీ ఉద్యోగులతో పాటు తిరుపతికి అనదపు కనెక్టివిటీ ఏర్పడుతుంది.
సంబంధిత కథనం