YSR Birth Anniversary : మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో అన్న, చెల్లి చర్చ మొదలైంది. ఎవరికి వారే తగ్గేదేలేదంటూ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. అందుకోసం పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ, అటు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ రాజన్న జయంతి కార్యక్రమాల నిర్వహణకు పిలుపు ఇచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి రోజున వైఎస్ కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన కడప జిల్లా ఇడుపులపాయలో కార్యక్రమాలు చేసేవారు. ఆయన సమాధి వద్ద ప్రార్థనలు చేసి, ఆయనకు సంతాపం తెలిపేవారు. అయితే రాజశేఖర్ రెడ్డి బిడ్డలు వైఎస్ జన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య తగాదాలు రావడంతో ఆమె కొంత కాలం తెలంగాణకు పరిమితమై అక్కడ పార్టీ పెట్టారు. దీంతో అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి రోజున జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి వేర్వేరుగా ఇడుపులపాయ వెళ్లి సంతాపం తెలిపి, ప్రార్థనలు చేసేవారు.
అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఆమె మళ్లీ ఆంధ్రప్రదేశ్ మకాం మార్చారు. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటీవలి జరిగిన ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. మరోవైపు 2019లో ఘన విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో తనకు తిరుగులేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని రికార్డు సాధించారు. అయితే ఐదేళ్లలోనే పూర్తిగా మారిపోయింది. ఆయన ఎంతైతే రికార్డు స్థాయిలో గెలుపొందారో అదే రికార్డు స్థాయిలో ఓటమి చవి చూశారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది. కేవలం 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకే పరిమితం అయ్యారు.
ఇలా అన్న, చెల్లి ఘోర ఓటమితో సతమతమవుతున్నారు. కుటుంబ సమస్యలే వారి ఓటమికి కారణమని, ఓటమి తరువాత తల్లి విజయమ్మ వీరిద్దరికి నచ్చచెప్పి, విభేదాలు పోగొడతారని కొంతమంది శ్రేయోభిలాషులు అనేవారు. అయితే ఈనెల 8న రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వచ్చింది. ఈ జయంతి రోజునైనా అన్న, చెల్లి కలుస్తారేమోనని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అన్న, చెల్లి నువ్వా నేనా అన్న రీతిలో వేర్వేరుగా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహిస్తున్నారు.
వారసత్వ పోరులో భాగంగానే రాజన్న బిడ్డలు ఇలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో జయంతి వేడుకల్లో పాల్గొంటారని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ, మండలాల్లోనూ రాజశేఖర్ రెడ్డి వేడుకులు నిర్వహించాలని వైసీపీ యోచిస్తోంది. ఘోర ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ, మొదటి కార్యక్రమంగా రాజన్న జయంతి వేడుకులకు పిలుపు ఇచ్చింది.
మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా కూడా రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు భారీగా నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన జయంతి వేడుకులు నిర్వహించాలని తెలిపారు. ఈ జయంతి వేడుకులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరుకానున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం