Ysrcp To Janasena: జనసేనలో చేరిన విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు.. పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
Ysrcp To Janasena: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరగా తాజాగా మరికొందరు జనసేనలో చేరారు. కార్పొరేషన్లో వైసీపీ బలం క్రమంగా తగ్గిపోతోంది.
Ysrcp To Janasena: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో వైసీపీకి ఎదురు దెబ్బ తగలింది. కార్పొరేషన్ కౌన్సిల్లో వైసీపీ బలం క్రమంగా తగ్గుతోంది. తాజాగా నలుగురు కార్పొరేటర్లు పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా, ఎన్నికలకు ముందే ఒక సభ్యుడు బీజేపీలో చేరారు. దీంతో కార్పొరేషన్‌లో వైసీపీ బలం తగ్గుతోంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 38వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.
వీరితో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం జెడ్పీటీసీ యేసుపోగు దేవమణి, అమలాపురం మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గుణిశెట్టి చినబాబు, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త, ఎన్.వి.ఆర్. ట్రస్ట్ ఫౌండర్ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ధర్మవరం మున్సిపాలిటి ఎం.రమణమ్మ, తోపుదుర్తి వెంకట్రాముడు, సరితాల ఆషాబీ, శ్రీ సరితాల మహ్మద్ బాషా, పి.రమాదేవి, వై.రాజు, తొండమాల ఉమాదేవి, రవిప్రసాద్, నాగార్జున, సోమశేఖర్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు…
“పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ పార్టీలో చేరికల సందర్భంగా వివరించారు.తాను ఒకరికి ఇచ్చే వ్యక్తినే తప్ప తీసుకునే వ్యక్తిని కాదని దశాబ్ధ కాలం పాటు ఎన్నో పోరాటాలు చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీని ముందుకు నడిపించామన్నారు. పార్టీకి ఈ రోజు క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల బలం ప్రజాదరణ ఉన్నాయని పార్టీలోకి వచ్చే నాయకులు దానిని మరింత పెంపొందించి పార్టీకి మరింత బలంగా మారాలన్నారు. రాష్ట్ర నిర్మాణంలో అందరం కలిసి ముందుకు నడవాల్సిన సమయం ఇదని విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తుల కలయిక రాష్ట్రానికి అవసరమన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు.
ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు
పార్టీని మొదలు పెట్టినప్పుడు ప్రజల కోసం పోరాడాలనే బలమైన ఆకాంక్ష తప్ప మరే ఆలోచన లేదని ఎన్నో కష్టాలు వచ్చినా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుకు కదిలామని 2009 నుంచి ఎమ్మెల్సీ హరిప్రసాద్ వెన్నంటే ఉన్నారని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కష్టకాలంలో అండగా నిలబడ్డారని 2016లో మంగళగిరిలో ఇదే చోట కార్యాలయాన్ని నిర్మించాలని భావించినప్పుడు ఇక్కడికి ఎవరూ రారని చాలా మంది చెప్పారని మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడానికి ఇబ్బందులుపడతారని చాలా మంది సలహాలు ఇచ్చారని పవన్ గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో కేవలం పార్టీ కార్యాలయం తప్ప చుట్టుపక్కల ఏమీ ఉండేవి కాదని అలాంటి పరిస్థితి నుంచి నేడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధునాతనంగా నిర్మించుకునే స్థాయికి వచ్చామన్నారు. దీనిలో మా శ్రమతోపాటు పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడిన జన సైనికులు, వీర మహిళల కష్టమే ఎక్కువన్నారు. పార్టీ ఇప్పుడు అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం 2024లో జనసేన పార్టీ పోరాటం ఓ చోదక శక్తిగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ అనుభవం, భారతీయ జనతా పార్టీ కేంద్ర మద్దతు భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి మేలు చేసేదిగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.