Vijayawada Mla: ఏపీ అసెంబ్లీలో విజయవాడకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్‌తో దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం రెవిన్యూ శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయవాడ నగరానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు కొన్ని రోజులు ప్రభుత్వ స్థలం క్రమబద్దీకరణ దరఖాస్తుల్ని రెవిన్యూ శాఖకు సిఫార్సు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ భూమిని కమబద్దీకరించడానికి కుదరదని అధికారులు దరఖాస్తుదారులకు స్పష్టం చేశారు.
విజయవాడ నగరంలోని కాల్వగట్లు, నిషిద్ధ స్థలాలను ఆక్రమించిన వారు ఇప్పటికే ఆ స్థలాల్లో భారీ భవనాలు నిర్మించడంతో ఎలాగైనా వాటిని క్రమబద్దీకరించాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అభ్యంతరం చెప్పడంతో అసెంబ్లీలోనే ఆయన రెచ్చిపోయారు. గ్యాలరీలో ఉన్న సీసీఎల్‌ఏ జయలక్ష్మీ దగ్గరకు వెళ్లి అభ్యంతరకరంగా ప్రవర్తించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన మంత్రితో కూడా సదరు ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో తీవ్ర మనస్తాపానికి గురైన సీసీఎల్‌ఏ గురువారం అసెంబ్లీకి, తన కార్యాలయానికి కూడా వెళ్లలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 150 గజాల్లోపు స్థలంలో రేకుల ఇళ్లు, ఆర్‌సీసీ భవనాలను నిర్మించుకుని అందులో నివాసం ఉంటే వాటిని క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. అయితే కాల్వ గట్లు, చెరువులు, కుంటలు, రక్షణశాఖ భూముల్ని క్రమబద్దీకరణ నుంచి మినహాయించింది. ఇతర ప్రభుత్వ భూములు, పోరంబోకు భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు మాత్రమే అవకాశం కల్పించింది.
విజయవాడ ఎమ్మెల్యే ఆక్రమణ క్రమబద్దీకరణ కోసం కొన్ని దరఖాస్తుల్ని రెవిన్యూ శాఖకు పంపారు. వీటిలో కోట్ల ఖరీదు చేేసే 900 గజాల భూమి క్రమబద్దీకరణ దరఖాస్తులు కూడా ఉన్నాయి. ఆ భూములు ఇరిగేషన్ పరిధిలో ఉన్న స్థలాలు కావడంతో వాటిని క్రమబద్దీకరించడానికి అధికారులు నిరాకరించారు. ఈ మొత్తం 900 గజాలను ముగ్గురు వ్యక్తుల పేరుతో వేర్వేరుగా దరఖాస్తు చేశారు. కాల్వగట్లు, రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కావడంతో అనుమతించడం సాధ్యం కాదని తేలుస్తూ ఫైల్‌పై కొర్రీలు వేశారు.
ఇరిగేషన్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి అదే నియోజక వర్గంలో పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే కూడా గతంలో ప్రయత్నించారు. అప్పుడు కూడా రెవిన్యూ అధికారులు వాటిని అడ్డుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. నగరం నడిబొడ్డున కోట్ల రుపాయల ఖరీదు చేసే భూమి కావడంతో ఫైల్‌ను నడిపే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగా రెవిన్యూ శాఖలో తనకు కావాల్సిన అధికారితో ప్రయత్నాలు చేశారు. ఈలోగా ఆ అధికారి బదిలీపై వెళ్లిపోయారు. క్రమబద్దీకరణకు నిరాకరిస్తూ రిజెక్ట్ చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బుధవారం రెచ్చిపోయారు.
బుధవారం టీ బ్రేక్‌సమయంలో శాసనసభలో ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు ఉండే గ్యాలరీకి వెళ్లారు. అక్కడ ఉన్న రెవిన్యూ శాఖకు చెందిన ఐఏఎస్‌లతో గొడవకు దిగారు. సీసీఎల్‌ఏ జయలక్ష్మీ ఫైల్ ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో వివరిస్తుంటే రెచక్చిపోయారు. తాను సిఫార్సు చేసిన అధికారిని బదిలీ చేశారని ఆరోపిస్తూ.. తన ఫైళ్లను కావాలనే రిజెక్ట్ చేశారంటూ వాదులాటకు దిగారు. ‘‘పేదలు ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేదా? ఎంత ధైర్యం ఉంటే నా పనులను అడ్డుకుంటారు?’’ అని గట్టిగా కేకలు వేశారు. ఎమ్మెల్యే వీరంగం వేస్తుండటంతో సమాచారం అందుకున్న రెవిన్యూ మంత్రి అక్కడకు వెళ్లి ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు.
అధికారులతో వ్యవహరించే తీరు అది కాదని మంత్రి సముదాయించడంతో ఆయనపై కూడా ఎమ్మెల్యే విరుచుకుపడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. తనను అడ్డుకోవడం ఏమిటని, తన పనులు చేయరా? నీకసలు ఫైళ్లు చూడటం వచ్చా అని మంత్రిని ప్రశ్నించినట్టు చెబుతున్నారు. మంత్రి వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతోందా అని దూషించారని, ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసా? పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్‌లో ఫెయిల్ అయ్యారని, పేదలకు మేలు చేయడం చేత కాదని ఆరోపించినట్టు సమాచారం.
ఎమ్మెల్యే తీరుతో షాక్ అయిన మంత్రి కూడా ఎమ్మెల్యేపై ఎదురు దాడి చేసినట్టు తెలుస్తోంది. ‘‘పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందుందని, డబ్బున్నోళ్లు, బలిసినోళ్లకు, అక్రమార్కులకు మేలు చేయడానికి సిద్ధంగా లేదు. కాలువగట్లు, రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్ చేయమంటే ఎలా సాధ్యం? రూల్స్‌కు విరుద్ధంగా ఏ మంత్రి, అధికారి పనిచేయడు. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయమంటే చేయం, అధికారులను గౌరవించడం చేతకాకపోతే మాట్లాడొద్దు. హీరోలవ్వలని చూడొద్ద’’ అంటూ చురకలు వార్నింగ్ ఇచ్చారు. గొడవ ముదరడంతో ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు.
అసెంబ్లీలో చెలరేగి పోయిన ఎమ్మెల్యే తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బీసెంట్ రోడ్డులో ఆక్రమణల వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే పేరు తెరపైకి వచ్చింది. అంతకు ముందు మద్యం దుకాణాల విషయంలో కూడా సదరు నాయకుడి పేరు విస్తృతంగా ప్రచారం అయ్యింది. తాజా వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రికి చేరాయి. ఇప్పటికే మంత్రితో మాట్లాడారని తిరుపతివ పర్యటన ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వ్యవహార శైలిపై చర్యలు ఉండొచ్చని తెలుస్తోంది.
సంబంధిత కథనం