BiWeekly Special : విజయవాడ-రాజమండ్రి మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీతో విజయవాడ-రాజమండ్రి మధ్య వారంలో రెండు సార్లు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
విజయవాడ- రాజమండ్రి మధ్య ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ వారంలో రెండు సార్లు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ట్రైన్్ నంబర్్ 07459 విజయవాడ-రాజమండ్రి మెమూ రైలు సాయంత్రం ఏడుంపావుకు విజయవాడలో బయలుదేరి రాత్రి పదకొండున్నరకు రాజమండ్రి చేరుతుంది. ఆగష్టు 1 నుంచి ప్రతి సోమ, మంగళవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. రాజమండ్రి-విజయవాడ మధ్య ట్రైన్ నంబర్ 07460 రైలు ఉదయం మూడుం పావుకు బయలుదేరి ఉదయం 7.55కు విజయవాడ చేరుకుంటుంది. ప్రతి మంగళ, బుధ వారాల్లో రైలు నడుపనుంది.
ఈ రైలు ముస్తాబాద, గన్నవరం, పెదావుటుపల్లి, తేలప్రోలు, నూజివీడు, వట్లూరు, పవర్ పేట, ఏలూరు, చేబ్రోలు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు స్టేషన్లలో ఆగుతుంది.
కోవిడ్ కారణంగా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ రెండేళ్ల క్రితం రద్దు చేసింది. వాటిలో కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ సర్వీసుల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా తగ్గు ముఖం పట్టడంతో ప్రయాణాలు యథావిధిగా సాగుతున్నా రైళ్లు మాత్రం పూర్తిగా నడపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరించిన ప్యాసింజర్ రైళ్ల విషయంలో మాత్రం ఇంకా స్ఫష్టత కొరవడింది.
విజయవాడ నుంచి బిట్రగుంట, గుడివాడ, నర్సాపూర్, డోర్నకల్, రాజమండ్రి, మచిలీపట్నం, ఒంగోలు ప్రాంతాలకు నిత్యం నడిచే ప్యాసింజర్ రైళ్లలను పూర్తి స్థాయిలో నడపకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నయ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ఎక్స్ ప్రెస్ రైళ్లకు చిన్న స్టేషన్లలో హాల్ట్ లేకపోవడం కూడా సమస్యగా మారింది.