Drugs Seized: బెంగుళూరు టూ కాకినాడ వయా బెజవాడ-vijayawada police seized the prohibited drugs being transported from bengaluru to kakinada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vijayawada Police Seized The Prohibited Drugs Being Transported From Bengaluru To Kakinada

Drugs Seized: బెంగుళూరు టూ కాకినాడ వయా బెజవాడ

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 10:51 AM IST

Drugs Seized: బెంగుళూరు నుంచి విజయవాడ మీదుగా కాకినాడ తరలిస్తున్న నిషేధిత మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కొనుగోలుదారులకు చేరవేసేందుకు తీసుకువెళుతున్న మాదక ద్రవ్యాలను పక్కా సమాచారంతో పట్టుకున్నారు.

డ్రగ్స్‌ తరలిస్తున్న ఫార్మా  విద్యార్ధిని అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు
డ్రగ్స్‌ తరలిస్తున్న ఫార్మా విద్యార్ధిని అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు (HT_PRINT)

Drugs Seized: విజయవాడ మీదుగా గోదావరి జిల్లాలకు తరలిస్తున్న మాదక ద్రవ్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రయాణికుడి నుంచి 42గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ మీదుగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో విజయవాడలో కృష్ణలంక పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కలకలం సృష్టించిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా విషయంలో ఇప్పటికే ఏపీ పోలీసులు అప్రతిష్ట పాలవడంతో ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గంజాయి సాగు, మాదక ద్రవ్యాల వినియోగంలో జాతీయ స్థాయిలో ఏపీ అగ్రస్థానంలో ఉందనే నివేదికల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని వెలుగు చూడకుండా జాగ్రత్త వహించారు. నిందితుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.సతీష్‌... కాకినాడలో చదువుతున్నాడు. 6 నెలల నుంచి బెంగళూరు నుంచి ఎండీఎంఏను తీసుకొచ్చి స్థానికులకు విక్రయిస్తున్నాడు. ఈనెల 5న కాకినాడకు 50 గ్రాముల డ్రగ్స్‌తో బయలుదేరాడు. నిఘా వర్గాల సమాచారంతో సతీష్ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.

బెంగళూరు నుంచి కాకినాడ వరకు ఒకే బస్సులో ప్రయాణిస్తే దొరికిపోతాననే అనుమానంతో విజయవాడలో దిగిపోయాడు. ముందస్తు సమాచారంతో నిందితుడి కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడ చేరుకున్న వెంటనే నిందితుడిని ట్రాక్ చేశారు. అతడి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

డబ్బు కోసం మాదక ద్రవ్యాల రవాణా…

కాకినాడలో చదువుకుంటున్న సతీష్‌కు అదే కాలేజీలో ఫోరెన్సిక్‌ కోర్సు చదువుతున్న కేరళకు చెందిన అబ్దుల్‌ మిషాల్‌ అహ్మద్‌ పరిచయం అయ్యాడు. అతని ప్రోద్బలంతో డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో గంజాయి రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి తీసుకొచ్చి.. బెంగళూరుకు తీసుకెళ్లి ఇచ్చేవాడు.

గంజాయి రవాణా చేసినందుకు సతీష్‌కు అబ్దుల్ మిషాల్‌ డబ్బులిచ్చేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో మిషాల్‌ సొంతంగా ఎండీఎంఏ మిథలీన్‌ డైఆక్సీ మెటాఫెటామిన్‌ అనే డ్రగ్‌ను క్రిస్టల్‌ రూపంలో తయారు చేయడం ప్రారంభించాడు. దీనిని కాకినాడ, హైదరాబాద్‌లోని కస్టమర్లకూ సరఫరా చేసేవాడు.

మిషాల్ నుంచి 6 నెలలుగా బెంగళూరు నుంచి ఎండీఎంఏను తీసుకొచ్చి సతీష్‌ విక్రయిస్తున్నాడు. ఈనెల 1న కాకినాడ నుంచి బెంగళూరుకు రైలులో బయలుదేరాడు. అక్కడకు చేరుకున్న తర్వాత మిషాల్‌ గదిలో 3 రోజులు బసచేశాడు. తిరిగి 5న కాకినాడకు 48.6 గ్రాముల డ్రగ్స్‌ను పాయసం మిక్స్‌ డబ్బాలో పెట్టుకుని బయలుదేరాడు. వీటిని పెద్దాపురంలో తమిళనాడుకు చెందిన మహేంద్రన్‌, కేరళకు చెందిన గోకుల్‌ కృష్ణన్‌కు, హైదరాబాద్‌కు చెందిన అఖిల్‌, కాకినాడలో అలెక్స్‌, విజయ్‌లకు సరఫరా చేసేందుకు మిషాల్ దగ్గర డబ్బు తీసుకున్నాడు.

బెంగళూరు నుంచి కాకినాడకు వస్తూ.. విజయవాడలో దిగిపోయాడు. అప్పటికే సతీష్‌ కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్న మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

IPL_Entry_Point