Vijayawada Police : విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన.. డ్రోన్లతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కాప్స్!-vijayawada police clearing traffic with the help of drones ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Police : విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన.. డ్రోన్లతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కాప్స్!

Vijayawada Police : విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన.. డ్రోన్లతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న కాప్స్!

Basani Shiva Kumar HT Telugu
Oct 20, 2024 02:18 PM IST

Vijayawada Police : బెజవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించేలా చర్యలు ప్రారంభం అయ్యాయి. తాజాగా.. విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ప్రధాన కూడళ్లలో డ్రోన్లు వినియోగిస్తూ.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. వాహనాల రద్దీని అంచనా వేస్తూ.. డైవర్షన్ చేస్తున్నారు.

డ్రోన్లతో ట్రాఫిక్ క్లియర్
డ్రోన్లతో ట్రాఫిక్ క్లియర్

విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. డ్రోన్లను వినియోగిస్తు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు.. వినూత్నంగా ఆలోచించి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నారు. లైవ్ డ్రోన్ కెమెరాల (లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్) ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిశీలించి.. సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.

విజయవాడ నగరంలో పలు కూడళ్లలో తరుచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా రామవరప్పాడు రింగ్ దగ్గర, బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో ఎప్పడూ భారీగా వాహనాలు నిలిచిపోతుంటాయి. ఇటు హైదరాబాద్ రూట్లోనూ భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో.. డ్రోన్ల సాయంతో.. వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు.

విజయవాడలోని డైవర్షన్ పాయింట్స్ ప్రకాశం బ్యారేజీ, గొల్లపూడి వై జంక్షన్, రామవరప్పాడు, బెంజ్ సర్కిల్ ఏరియాల్లో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటున్నారు. ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను డ్రోన్ల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తున్నారు. అక్కడ ఉన్న అధికారులు.. సూచనలు చేస్తూ ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ తగ్గుతోంది.

ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు, విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే రోడ్డు, విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్న సమస్య వచ్చినా.. జాతీయ రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఎమర్జెన్సీ వెహికిల్స్ కూడా కదల్లేని పరిస్థితి ఉంటోంది. ఈ డ్రోన్ల వినియోగంతో.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడం తోపాటు.. ఎమర్జెన్సీ వాహనాలను త్వరగా పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాన జంక్షన్ల దగ్గర ఉంటున్న సిబ్బందికి వాకీటాకీల ద్వారా సమాచారం ఇచ్చి.. తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఈ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుందని బెజవాడ వాసులు చెబుతున్నారు. విజయవాడ పోలీసుల ఆలోచనను అభినందిస్తున్నారు.

Whats_app_banner