Commercial Tax Employees: జిఎస్టీ వసూళ్లలో అక్రమాలు.. నలుగురు ఉద్యోగుల అరెస్ట్-vijayawada police arrested four employees for irregularities in gst collection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vijayawada Police Arrested Four Employees For Irregularities In Gst Collection

Commercial Tax Employees: జిఎస్టీ వసూళ్లలో అక్రమాలు.. నలుగురు ఉద్యోగుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 08:08 AM IST

Commercial Tax Employees: జిఎస్టీ వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది.

జిఎస్టీ వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగుల అరెస్ట్
జిఎస్టీ వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగుల అరెస్ట్ (unspalsh)

Commercial Tax Employees: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ లావాదేవీలపై స్వతంత్ర ఏజేన్సిలతో విచారణ జరిపిన తర్వాత విజయవాడ మొదటి డివిజన్ స్టేట్ టాక్స్ ఆఫీస్ డిప్యూటి కమీషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టులు చేసినట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అంతర్గత విచారణలో విజయవాడ మొదటి డివిజన్ స్టేట్ టాక్స్ ఇంటిలిజెన్స్ విభాగ కార్యాలయంలో పనిచేస్తున్న కొంత మంది ప్రభుత్వ అధికారులు ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే విధంగా డీలర్లు, వ్యాపారులు, వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది, మరికొందరితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు.

మరోవైపు ప్రభుత్వానికి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘానికి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజా అరెస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖలో నాలుగు జోన్లను మూడింటికి కుదించడం, శాఖాపరమైన మార్పులు చేర్పులను ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించడంతోనే అరెస్ట్‌లు చేశారని ఆరోపిస్తున్నారు. శాఖా పరమైన రీ పునర్‌ వ్యవస్థీకరణ-2 అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కమిషనర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టులు చర్చనీయాంశమయ్యాయి.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తాము ఉద్యమం చేస్తుండటంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగమే అరెస్టులని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. అరెస్టు చేసిన వారి ఆచూకీ తెలియడం లేదన్నారు.

గుడివాడలో ఒకరు, విజయవాడలో ముగ్గురు

వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ సంధ్యను బుధవారం గుడివాడలో పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్య సమస్యలతో సెలవులో ఉన్న మెహర్‌ కుమార్‌ను ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ చలపతి, విజయవాడ-1 డివిజన్‌ కార్యాలయంలో అటెండర్‌ సత్యనారాయణను వారు పనిచేసే కార్యాలయాల్లో అరెస్టు చేశారు.

ఉద్యోగులను అరెస్ట్ చేయడంతో సహచర ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అరెస్టయిన వారిలో మెహర్‌కుమార్‌ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కాగా మిగిలిన వారు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీరిని విజయవాడలోనే అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది.

తప్పుడు రికార్డులు సృష్టించి లబ్ధి పొందారు..

'నిందితులు స్వలాభం కోసం వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి, తప్పుడు రికార్డులు సృష్టించి లబ్ధి పొందారని పోలీసులు పేర్కొన్నారు. పంపిణీ రిజిస్టర్లలోనూ తప్పుడు లెక్కలు నమోదు చేసి, ఏపీ జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారని, డీలర్లు, ఏజెన్సీలు, వ్యక్తుల ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ.. పన్నును తగ్గించి, వసూలు చేశారని తెలిపారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. డీలర్లు, ఏజెన్సీల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని సంబంధిత రికార్డులను మాయం చేశారని వివరించారు. ఈఎస్‌ఐ, నీరు- చెట్టు, తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కోసం తనిఖీ నిమిత్తం ఆడిటర్లను పిలిచి, ఆ ఫైళ్లను మూసివేయడానికి భారీ మొత్తంలో డిమాండ్‌ చేశారన్నారు.

పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని, జరిమానా విధించకుండా వదిలేశారని దీంతోపాటు డీలర్లు సమర్పించిన డేటాకు, పంపిణీ రిజిస్టర్లలోని వివరాలకు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని కమిషనర్‌ కాంతిరాణా టాటా వెల్లడించారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

తాజాగా ఘటనలో గతంలోనే వీరంతా సస్పెండయ్యారు. అప్పటి నుంచి అంతర్గత విచారణ సాగుతోంది. ఇటీవల ఒక్కొక్కరు విధులకు హాజరవుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖలోని విజయవాడ-1 డివిజన్‌కు జాయింట్‌ కమిషనరుగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ ఐఏఎస్‌ అధికారిని గత నెలలో నియమించింది. డివిజన్‌ కేంద్రంగా కొద్దికాలం నుంచి ఉద్యోగ సంఘాలు, వాణిజ్య పన్నుల శాఖలోని పలువురు ఉన్నతాధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేస్తున్నారంటూ పలువురుని ప్రభుత్వం బదిలీ చేయడంతో ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ వారు 'స్టే' పొందారు.

కక్ష సాధింపు చర్యలంటున్న ఉద్యోగుల సంఘం…

ఒకటో తేదీన జీతాలివ్వాలని గవర్నర్‌ను కలిసినందుకే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఉద్యోగులను వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ఆరోపించారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నలుగురిని కారణం కూడా చెప్పకుండానే పోలీసులు తీసుకెళ్లిపోయారన్నారు. విజయవాడలో సూర్యనారాయణ బుధవారం విలేకర్లతో మాట్లాడారు.

IPL_Entry_Point