Lokesh Padayatra : ఈ నెల 27న లోకేశ్ పాదయాత్ర పునః ప్రారంభం, విశాఖలో ముగించే యోచన!-vijayawada news in telugu nara lokesh yuvagalam padayatra restart from november 27th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Padayatra : ఈ నెల 27న లోకేశ్ పాదయాత్ర పునః ప్రారంభం, విశాఖలో ముగించే యోచన!

Lokesh Padayatra : ఈ నెల 27న లోకేశ్ పాదయాత్ర పునః ప్రారంభం, విశాఖలో ముగించే యోచన!

Bandaru Satyaprasad HT Telugu
Nov 25, 2023 10:08 PM IST

Lokesh Padayatra : ఈ నెల 27న యువగళం పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచే లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

Lokesh Padayatra : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు మళ్లీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. దీంతో పాటు టీడీపీ బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను నిలిపివేసింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో లోకేశ్ పాదయాత్రతో పాటు టీడీపీ కార్యక్రమాలు మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ఈ నెల 27న పాదయాత్ర పునఃప్రారంభం

సుమారు రెండున్నర నెలల విరామం తర్వాత లోకేశ్...గతంలో నిలిచిపోయిన పొదలాడ నుంచే పాదయాత్ర ప్రారంభిస్తు్న్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. తాటిపాక సెంటర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. తాటిపాక సెంటర్ లో బహిరంగ సభ, అనంతరం 15 కిలోమీటర్ల మేర పాదయాత్రను లోకేశ్ కొనసాగిస్తారు. అనంతరం లోకేశ్ పాదయాత్ర అమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.

విశాఖలో పాదయాత్ర ముగిసే అవకాశం!

తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్ పాదయాత్రను ముగించాలని భావించారు. ఉమ్మడి జిల్లాలను కలిపే విధంగా లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. సెప్టెంబర్ 9 వరకు 84 నియోజకవర్గాల్లో నారా లోకేశ్ 208 రోజులపాటు 2,852 కిలోమీటర్లకు నడిచారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లోకేశ్ యువగళం పాదయాత్ర చేయాలని భావించారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో లోకేశ్ పాదయాత్ర ముగించాలని భావించారు. పాదయాత్రను విశాఖలోనే ముగించాలని ప్రస్తుతం లోకేశ్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ సమయానికి ఎన్నికలు సమీపించే అవకాశం ఉండడంతో పాదయాత్రను ముగించే అవకాశం ఉంది.

నారా భువనేశ్వరి జిల్లాల పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైనట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు అనంతరం మనస్థాపంతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరిట యాత్ర చేపట్టారు.

చంద్రబాబు దిల్లీ పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు ఈ నెల 27న దిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా కుమారుని పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు దంపతులు హాజరు కానున్నారు. ఆదివారం సిద్దార్థ్ లూద్రా కుమారుని వివాహం జరగనుంది. సోమవారం చంద్రబాబు, భువనేశ్వరి దిల్లీకి వెళ్లనున్నారు. 28 వరకు చంద్రబాబు దిల్లీలోనే పర్యటించనున్నారు.

Whats_app_banner