CM Jagan : మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌- సీఎం జగన్-vijayawada news in telugu cm jagan started rs 6600 cr power project signed on hpcl pact ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌- సీఎం జగన్

CM Jagan : మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌- సీఎం జగన్

Bandaru Satyaprasad HT Telugu
Nov 28, 2023 08:57 PM IST

CM Jagan : రాష్ట్రంలో రూ.6600 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ మంగళవారం శ్రీకారం చుట్టారు. 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభించారు.

హెచ్పీసీఎల్ తో ఒప్పందం
హెచ్పీసీఎల్ తో ఒప్పందం

CM Jagan : ఇంధన రంగానికి సంబంధించి రూ.6600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, పనులకు సీఎం జగన్ మంగళవారం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కడపలో 750 మెగావాట్లు సామర్థ్యం, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం జగన్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటితో పాటు 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్ తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం జగన్ సమక్షంలో అవగాహనా ఒప్పందం జరిగింది.

25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్

సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇవాళ ప్రారంభించిన సబ్‌స్టేషన్లతో స్థానికులు కష్టాలు తీరనున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రైతులకు 9 గంటల విద్యుత్‌ పగటి పూటే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 సబ్‌ స్టేషన్లకు శ్రీకారం చుట్టామన్నారు. 14 జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ బలోపేతం చేసుకున్నామన్నారు. గోదావరి ముంపు ప్రాంతాలైన చింతూరు, వీఆర్‌పురం, ఎటపాకలో సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభించామన్నారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. రూ.1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇచ్చేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు.

హెచ్‌పీసీఎల్‌ సంస్థతో ఒప్పందం

రాష్ట్రంలో సుమారు రూ.3099 కోట్లతో 28 సబ్‌స్టేషన్లను నిర్మించుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. కొన్నింటిని ఇవాళ ప్రారంభించామని, మరికొన్నింటి పనులు మొదలయ్యాయన్నారు. దీంతో పాటు రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామన్నారు. అవేరా స్కూటర్స్ సంస్థ రూ. 6500 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన అవేరా స్కూటర్స్ సంస్థ.. లక్ష స్కూటర్ల ఉత్పత్తికి సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు. తాజాగా ప్రారంభించిన సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల మరో 1700 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. హెచ్‌పీసీఎల్‌ సంస్థతో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. ఈ సంస్థతో 1500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులతో ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.