AP Medical Jobs : ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
AP Medical Services Jobs : ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

AP Medical Services Jobs : ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 పోస్టులను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులను డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది.
నెల జీతం ఎంతంటే?
వయోపరిమితి జులై 1, 2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, స్పెషల్ డాక్టర్లకు 70 సంవత్సరాలలోపు వయో పరిమితి సడలింపు ఉంది. పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ లో వచ్చిన మార్కులు, ఎక్స్ ప్రీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికలు చేస్తారు. రెగ్యులర్ పోస్టులకు నెల జీతం రూ.61,960 నుంచి రూ.1,51,37 కాగా కాంట్రాక్ట్ పోస్టులకు గిరిజన ప్రాంతాలలో నెల జీతం రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ.1.3 లక్ష ఇస్తారు.
పోస్టుల ఖాళీలు
మొత్తం 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. జనరల్ మెడిసిన్- 37, గైనకాలజీ- 12, అనస్థీషియా- 15, పీడియాట్రిక్స్- 11, రేడియాలజీ- 38, పాథాలజీ- 2, జనరల్ సర్జరీ- 3 , ఆర్థోపెడిక్స్- 1, ఆప్తాల్మాలజీ: 10 , ఫోరెన్సిక్ మెడిసిన్- 2 , డెర్మటాలజీ- 11, ఈఎన్‌టీ- 7, సైకియాట్రీ- 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు
- డిసెంబర్ 11న - జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్
- డిసెంబర్ 13న - గైనకాలజీ, పాథాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ
- డిసెబంర్ 15న - పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, ఆప్తాల్మాలజీ, రేడియోలజీ,
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ సర్టిఫికేట్లు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రిటైర్డ్ స్పెషలిస్ట్ డాక్టర్లు, జూలై 1 నాటికి 70 సంవత్సరాలు పూర్తికానివారు రిటైర్‌మెంట్ ఆర్డర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వెంట తీసుకురావాలి. దీంతో పాటు 4వ తరగతి నుంచి 10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్లు, నోటిఫికేషన్ లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.