AP Liquor Rates Hike : మందుబాబులకు బిగ్ షాక్, ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు
AP Liquor Rates Hike : ఏపీలో మరోసారి మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్ బాటిల్ పై రూ.10-40, ఫుల్ బాటిల్ పై రూ.10-90 వరకూ పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.
AP Liquor Rates Hike : మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్వార్టర్ సీసాపై రూ.10-40, ఫుల్ బాటిల్ పై రూ.10-90 పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రూపాయల్లో ఉంటే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. పన్ను సవరించాలన్న ఉద్దేశంతో మద్యం ధరలు పెంచినట్లు తెలిపారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గగా, అవి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఎక్కువ మంది కొనుగోలు చేయకపోవడం వల్ల కొన్ని బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
క్వార్టర్ సీసాపై రూ.10-40 పెంపు
పలు మద్యం బ్రాండ్లపై ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ARTE)ను వివిధ బ్రాండ్ల మూల ధరపై శాతాల రూపంలో వసూలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి అనుగుణంగా బ్రాండ్ల వ్యాట్, ఏఈడీనీ సవరించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పెంపుతో కొన్ని బ్రాండ్ల మద్యం క్వార్టర్ సీసా రూ.10-40 వరకు, హాఫ్ బాటిల్ రూ.10-50, ఫుల్ బాటిల్ రూ.10-90 వరకు పెరిగాయి. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలు పెరగగా, తక్కువగా అమ్ముడయ్యే, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గాయి. మద్యం ధరలు పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం రానుంది.
రిటైల్ ఎక్సైజ్ పన్ను పెంపు
ఒక్కో బీరు కేసుపై 225 శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను విధించగా, ఫారిన్ లిక్కర్ కేసుపై 75 శాతం ఏఆర్‌ఈటీ విధించారు. ఒక్కో కేసు మూలధర రూ.2,500 లోపు ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్ల మూలధరపై 250 శాతం, మూలధర రూ.2,500 కంటే ఎక్కువ ఉన్న మద్యం బ్రాండ్లపై 150 శాతం ఏఆర్‌ఈటీ విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. వీటిపై ఏఈడీ 10 శాతం, వ్యాట్ 10 శాతం, స్పెషల్ మార్జిన్ 110 శాతం చొప్పున వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఫారిన్ మద్యం సరఫరాదారుల నుంచి కొనుగోలు చేసే మందు ధరలను ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
విదేశీ బ్రాండ్ల ధరలు పెంపు
ఏపీఎస్‌బీసీఎల్ వద్ద రిజిస్టర్ అయిన విదేశీ బ్రాండ్లకు చెల్లిస్తున్న ధరలపై 20 శాతం పెంచింది. అంతకంటే తక్కువకు ఎవరైనా సరఫరా చేసేందుకు ముందుకుస్తే ఆ ధరనే చెల్లిస్తామన్నారు. కొత్తగా నమోదు అయినా బ్రాండ్లకు ఇతర రాష్ట్రాలు చెల్లిస్తున్న ధరను చెల్లిస్తామని ప్రకటించారు.