AP CID Notices To TDP : ఆ రూ.27 కోట్ల వివరాలు ఇవ్వండి, టీడీపీకి సీఐడీ నోటీసులు
AP CID Notices To TDP : స్కిల్ స్కామ్ లో నిధులు టీడీపీ ఖాతాల్లోకి మళ్లించారని సీఐడీ అభియోగిస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా సీఐడీ టీడీపీకి నోటీసులు ఇచ్చింది. టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.
AP CID Notices To TDP : తెలుగుదేశం పార్టీకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. టీడీపీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను ఈ నెల 18వ తేదీ లోపు సీఐడీకి సమర్పించాలని పేర్కొంది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సీఐడీ కానిస్టేబుల్ అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో భాగంగా టీడీపీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని సీఐడీ నోటీసుల్లో తెలిపింది. అయితే సీఐడీ అధికారులు కక్షపూరితంగా వేధిస్తున్నారని టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.
రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి!
టీడీపీ జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ ఖాతాలోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు అందించాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఖాతాలోకి వచ్చిన వివరాలతో ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి టీడీపీ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ కు నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లించారని సీఐడీ అభియోగిస్తుంది. ఈ వివరాలను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను కూడా విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
సీఐడీ అభియోగాలు
స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ.. ఏసీబీ కోర్టుకు ఇప్పటికే పలు కీలక ఆధారాలను సమర్పించింది. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో రూ. 370 కోట్ల నిధులను కొట్టేశారని.. షెల్ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించారని సీఐడీ కోర్టుకు తెలిపింది. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి కూడా రూ. 27 కోట్లను మళ్లించారని సీఐడీ అభియోగించింది. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించింది. తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను సీఐడీ కోర్టుకు సమర్పించింది. రూ.27 కోట్లు జమ కావటంపై టీడీపీ ఆడిటర్‌ను విచారణ చేయాల్సి ఉందని తెలిపింది.
స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 53 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు నాలుగు వారాలు బెయిల్ ఇచ్చింది. దీంతో చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసు బనాయించిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తుంది.