Vijayawada Lawyers Bus Accident : రాజస్థాన్ విహారయాత్రలో తీవ్ర విషాదం, ప్రముఖ న్యాయవాది రాజేంద్రప్రసాద్ సతీమణి మృతి
Vijayawada Lawyers Bus Accident : రాజస్థాన్ లో విజయవాడ లాయర్ల బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి గుళ్ళపల్లి జ్యోత్స్న మృతి చెందారు. జ్యోత్స్న మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలో విజయవాడ న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి గుళ్ళపల్లి జ్యోత్స్న మృతి చెందారు. మరికొంత మంది లాయర్లు గాయపడ్డారు.
రాజస్థాన్ లోని జోధ్‌పూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి గుళ్ళపల్లి జ్యోత్స్న (65) అక్కడికక్కడే మృతి చెందారు. సుంకర రాజేంద్ర ప్రసాద్, మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి జైపూర్ దగ్గరలోని బార్వలో వైద్య చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన జ్యోత్స్న మృతదేహాన్ని విమాన మార్గం ద్వారా బుధవారం ఉదయం విజయవాడకు తరలించనున్నారు.
బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల సంఘాల నేతలు విజయవాడలోని రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన ప్రముఖ ఇంజినీర్ గుళ్లపల్లి రామకృష్ణకు ఇద్దరు కుమారులు, కుమార్తె జ్యోత్స్న.
జ్యోత్స్న చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలతో.. అమరావతి బాలోత్సవ్ కమిటీ సెక్రటరీగా, తరుణీ తరంగాల జనరల్ సెక్రటరీగా సమాజ మార్పు కోసం కృషి చేస్తున్నారు. నిరంతరం మహిళా సమస్యలపై, సామాజిక అంశాలపై, మహిళా సాధికారత కోసం కృషి చేశారు. ఆమె మృతి కుటుంబ సభ్యులకే కాక సహచరులకు తీరని లోటుని నేతలు అభిప్రాయపడ్డారు. జోత్స్న పార్ధీవ దేహాన్ని రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడ సీతారాంపురంలోని వారి ఇంటి వద్ద ఉంచనున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
రాజస్థాన్ లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం...వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి బజన్ లాల్ శర్మతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. లాయర్ల ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందిచాలని కోరారు. అడ్వకేట్లు తిరిగి ఇంటికి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
సంబంధిత కథనం