Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై మహా శివరాత్రి మహోత్సవాలు-ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు నిర్వహణ
Indrakeeladri Shivaratri : ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు
Indrakeeladri Shivaratri : దుర్గామల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై మహా శివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఐదు రోజుల పాటు మహా శివరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది.
ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఆది దంపతులకు మంగళ స్నానాలతో ప్రారంభమై, మండపారాధనలు, కల్యాణోత్సవం, రథోత్సవం, పూర్ణాహుతితో ముగుస్తాయి. మార్చి 1 నుంచి 3 వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో పవళింపు సేవ జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 9 గంటలకు గంగా పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు, మంగళ స్నానాలు, నూతన వధూవరుల అలంకరణ జరుగుతుంది.
ప్రత్యేక కార్యక్రమాలు
సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనం, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25 తేదీన మండపారాధనలు, కలశారాధన, మూల మంత్ర వాహనం, బలిహరణ జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తేదీన మల్లేశ్వర స్వామి వార్లకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు త్రికాల అభిషేకాలు నిర్వహిస్తారు.
అదే రోజు రాత్రి 8.30 గంటలకు మహాన్యాసం, లింగోదర్భవ కాలాభిషేకం, రాత్రి గంగా పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వారి దివ్య లీలా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సదస్యం, సాయంత్రం నాలుగు గంటలకు కెనాల్ రోడ్డులో రథోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 9 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో పూర్ణాహుతి, ధాన్యకోట్నోత్సవం, దుర్గాఘాట్‌లో అవభృతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
సాధారణ ధరల్లోనే టికెట్లు
మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా మార్చి 1 నుంచి 3 వరకు ప్రతి రోజూ సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవ నిర్వహిస్తారు. భక్తులంతా ఈ ఉత్సవాలు సందర్భంగా దర్శనాలు చేసుకోవచ్చని కమిటీ పేర్కొంది. సాధారణ దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు తలలెత్తవని తెలిపింది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు టిక్కెట్టు సాధారణ ధరలతోనే ఉంటుందని వైధిక కమిటీ తెలిపింది. అయితే ఉత్సవాలు సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, కొన్ని ఆంక్షలు కూడా ఉంటాయని పేర్కొంది. భక్తులు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం