CM Chandrababu : చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం అందాలి, అధికారుల నిర్లక్ష్యం సహించేది లేదు -సీఎం చంద్రబాబు
CM Chandrababu : విజయవాడ వరద సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం అందడంలేదని ఫిర్యాదు వస్తున్నాయన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం అందాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని సంఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
CM Chandrababu : 'ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయి. బాబాయినే చంపించిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా' అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వార్డుల వారీగా మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోలో రూమ్ నుంచి 24 గంటలు 8 మంది ఐఏఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వరద బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రతి ఒక్కరిగా ఆహారం అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఐవీఆర్ఎస్ సందేశాలకు ప్రజలు స్పందించాలని సీఎం కోరారు. వరద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. సరిగా పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు సాయం కోసం ఎంత ఖర్చయినా చేస్తామన్నారు. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని సూచించారు.
"సహాయక చర్యలు మారుమూల ప్రాంతాలకు చేరాలి. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలి. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పని చేయాలి. అధికారులు సరిగా పని చేయకపోతే సహించేది లేదు. ప్రజలు బాధల్లో ఉన్నారు, ఎక్కడా అలసత్వం వద్దు. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించాం. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూరుస్తున్నాం. బాధితులకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నాం." - సీఎం చంద్రబాబు
ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై విచారిస్తాం
ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని, కానీ చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా? అని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేస్తామన్నారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. సొంత బాబాయినే చంపిన వారు ఉన్నప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తాయి కదా! అన్నారు. జగన్ ఏదో ఐదు నిమిషాలు రోడ్డు మీదకు వచ్చి షో చేసి వెళ్లారు. కనీసం ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడ వరద ముంపు సహాయచర్యల కోసం 120 మందితో ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు, నాలుగు హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో... పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుందని తెలిపారు.
ఆహార దాతల కోసం నిర్దేశిత పాయింట్
వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్దేశిత పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ఇందు కోసం ఐఏఎస్ అధికారి మనజీర్(79067 96105) ను సంప్రదించాలని సూచించారు. అధికారులు ఎవరికి కేటాయించిన ప్రాంతాల్లో వారు సమన్వయం చేసుకుంటూ సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని సూచించారు.
పారిశుద్ధ్యంపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామన్నారు. ప్రజల కూడా సంయమనం పాటించి సహకరించాలని కోరారు. ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్న వారికి అండగా నిలవాల్సిన సమయమిదని సీఎం చంద్రబాబు అన్నారు. ఫిర్యాదులు, విజ్ఞప్తుల కోసం మరో నెంబర్ ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. జక్కంపూడిలో తన విధులు సక్రమంగా నిర్వహించని ఉద్యోగిని సస్పెండ్ చేశామన్నారు. ఎవరైనా తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
సంబంధిత కథనం