30 Years Prudhvi : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి ఫ్యామిలీ కోర్టులో షాక్….
30 Years Prudhvi సినీ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి విజయవాడ ఫ్యామిలీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భరణం కేసులో పృథ్వీ భార్యకు నెలకు రూ.8లక్షలు భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. 2017 నుంచి భార్యకు భరణం బకాయిలు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
30 Years Prudhvi కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి విజయవాడ ఫ్యామిలీ కోర్టులోఎదురు దెబ్బ తగిలింది. గత ఐదేళ్లుగా విజయవాడ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసులో పృథ్వీ భార్యకు భారీగా భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
30 Years Prudhvi తన భార్య శ్రీలక్ష్మీకి ప్రతి నెల రూ.8లక్షల రుపాయలను భరణంగా చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదే ఆదేశించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ శేషుతో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి 1984లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పృథ్వీరాజ్ విజయవాడలోని అత్తగారింట్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం చెన్నై, హైదరాబాద్‌లలో ప్రయత్నిస్తూ ఉండేవారని, సినిమాల్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలకు తన కుటుంబ సభ్యులే ఖర్చులు భరించేవారని పృధ్వీరాజ్ భార్య కోర్టుకు తెలిపారు.
పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత పృథ్వీరాజ్ తరచూ తనను వేధించే వాడని,2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి గెంటేయడంతో పుట్టింట్లో ఉంటున్నట్లు పృధ్వీ భార్య కోర్టుకు ఫిర్యాదు చేశారు. తన పోషణ భారంగా మారడంతో భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ ఆమె 2017 జనవరి 10న విజయవాడ 14వ అదనపు ఫ్యామిలీ కోర్టులో దావా వేశారు. తన భర్తకు సినామాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30లక్షల ఆదాయం వస్తుందని, తన పోషణ కోసం భరణం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దాదాపు ఐదేళ్లుగా విచారణ జరిగిన తర్వాత పృథ్వీ భార్యకు నెలకు రూ.8లక్షల భరణం చెల్లించాలని న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని ఆదేశించారు.
కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత పృథ్వీరాజ్ తన భార్యకు భరణం చెల్లించాలని కేసు దాఖలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ప్రతినెల పదవ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో సినీ నటుడు పృథ్వీ తన భార్యకు దాదాపు ఆరు కోట్ల రుపాయలకు పైగా భరణం బకాయి చెల్లించాల్సి ఉంటుంది. ఈ తీర్పును పృథ్వీరాజ్ హైకోర్టులో సవాలు చేస్తారో, భార్యతో రాజీకి వస్తారో చూడాల్సి ఉంది. పృథ్వీరాజ్ ఆదాయానికి సంబంధించి ఆయన భార్య న్యాయస్థానానికి సమర్పించిన పత్రాల ఆధారంగా కోర్టు తీర్పు ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు.