Kesineni Nani : కేశినేని నాని కీలక నిర్ణయం-రాజకీయాలకు గుడ్ బై
Kesineni Nani : మాజీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Kesineni Nani : టీడీపీలో ఎంపీ టికెట్ దక్కకపోవడంతో... వైసీపీలో చేరి విజయవాడ నుంచి పోటీ చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. అయితే కూటమి ప్రభంజనంలో కేశినేని నాని... ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేశినేని నాని టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

"జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా, విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంటుంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను తదుపరి అధ్యాయానికి వెళుతున్నప్పుడు, ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నాను. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు" అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
కేశినేని నాని ప్రకటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. "అయ్యా కేశినేని నాని .. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే నిన్ను తప్పించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు ఐతే నిన్ను ఒక్కడినే విజయవాడ ప్రజలు ఓడించడం మరొక ఎత్తు. 2సార్లు నిన్ను పార్లమెంట్ కి పంపిన చంద్రబాబను పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. కనీసం నిన్ను 2సార్లు పార్లమెంట్ కి పంపిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పలేదు. అలాగే 2వ సారి నువ్వు గెలిచినప్పటి నుంచి నీ మాటలతో చంద్రబాబును బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలి అని కోరుకుంటున్నాము" అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం