Vijayawada Crime : బంగారం కోసం తల్లిని హత్య చేసిన పెద్ద కొడుకు కోడలు, రెండ్రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు
Vijayawada Crime : బంగారం కోసం కన్న తల్లిని హత్య చేశాడు గొప్ప కొడుకు. ఈ ఘనకార్యంలో కోడలి హస్తం కూడా ఉంది. అప్పులపై పాలై...ఆస్తి పంచాలని తల్లిని అడగగా..అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కొడుకు, కోడలు కలిసి ఆమెను హత్య చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
Vijayawada Crime : బంగారం కోసం కన్న తల్లిని హత్య చేశాడో కొడుకు...ఇందుకు కోడలు కూడా సాయం చేసింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మధురానగర్ లో లక్ష్మి (62) ఒంటరిగా నివసిస్తుంది. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి లక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందింది. సమాచారం అందుకున్న చిన్న కుమారుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి చూడగా...తల్లి ఒంటిపై ఉండవలసిన బంగారం లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గుణదల పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాలతో గుణదల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ.రఖీబ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించినారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారిని విచారిస్తున్న సమయంలో సంఘటన జరిగిన రాత్రి మృతురాలి పెద్ద కుమారుడు పెద్ద సాంబశివరావు అతని భార్య వాణితో కలిసి మధురానగర్ తల్లి దగ్గరకు వచ్చాడని, ఆస్తి విషయంలో తల్లితో గొడవ పడినట్లు తెలిసింది. మృతురాలి అంత్యక్రియలకు కూడా వారు రాకపోవడంతో వారిపై అనుమానంతో వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నెల 27న సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించారు. విచారణలో తల్లిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల పాలై...ఆస్తి కోసం
నిందితులైన సాంబశివరావు, వాణిలు భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. మంగళగిరి, ఆత్మకూరుకులో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సాంబశివరావుకు పక్షవాతం రావడంతో...తనకున్న అప్పులు తీర్చేందుకు తనకు రావాల్సిన ఆస్తి వాటా గురించి తల్లిని అడగాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 25న విజయవాడలోని తల్లి ఇంటి వచ్చి చాలా అప్పులుపాలై ఇబ్బందులు పడుతున్నాని డబ్బులు కావాలని, తనకు రావాల్సిన వాటా, డబ్బులు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వనని తల్లి చెప్పడంతో ...తల్లిని చంపి ఆమె వద్ద ఉన్న బంగారం తీసుకుందామని ప్లాన్ వేశాడు. రాత్రి నిద్రపోతున్న సమయంలో తలగడ దిండితో తల్లి ముఖంపై గట్టిగా నొక్కాడు. ఆ సమయంలో అతని భార్య వాణి....అత్త కాళ్లు కదపకుండా పట్టుకుంది. కొద్దిసేపటికి ఆమె చనిపోయిందని నిర్థారించుకుని ఆమె ఒంటిపై ఉన్న బంగారపు వస్తువులను తీసుకుని అక్కడ నుంచి ఆత్మకూరు వెళ్లిపోయారు.
తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకుని అంత్యక్రియలు వెళితే పట్టుకుంటారనే భయంతో అక్కడకు వెళ్లకుండా విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉండిపోయాడు. ఇక్కడే ఉండే పోలీసులు పట్టుకుంటారనే భయంతో హైదరాబాద్ వెళ్లిపోవడానికి బయలుదేరుతున్న సమయంలో గుణదల ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాస్, ఎస్.ఐ.రఖీబ్ సిబ్బందితో కలిసి విజయవాడ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.
ఈ కేసును రెండు రోజులలో ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు అభినందించారు.
సంబంధిత కథనం