Vijayawada Durga Temple : ఏడాదిలోపు పిల్లలున్న తల్లులకు ప్రత్యేక క్యూలైన్, దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలివే!-vijayawada durga temple board meeting key decisions live telecast goddess durga seva ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Durga Temple : ఏడాదిలోపు పిల్లలున్న తల్లులకు ప్రత్యేక క్యూలైన్, దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలివే!

Vijayawada Durga Temple : ఏడాదిలోపు పిల్లలున్న తల్లులకు ప్రత్యేక క్యూలైన్, దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలివే!

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2023 06:51 PM IST

Vijayawada Durga Temple : ఏడాది లోపు పిల్లలున్న తల్లులకు ప్రత్యేక క్యూలైన్, నూతన జంటలకు మ్యారేజ్ టికెట్, అమ్మవారి సేవల ప్రత్యక్ష ప్రసారం లాంటి కీలక నిర్ణయాలకు దుర్గగుడి పాలకమండలి ఆమోదం తెలిపింది.

విజయవాడ దుర్గగుడి
విజయవాడ దుర్గగుడి

Vijayawada Durga Temple : విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ...శివాలయంలో 40 లక్షల వ్యయంతో నవగ్రహ మండపం నిర్మించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. శివాలయాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాది లోపు వయసున్న చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి దర్శనం కల్పించాలని నిర్ణయించామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పాలకమండలి ఛైర్మన్ రాంబాబు తెలిపారు. నామమాత్రపు రుసుముతో డార్మిటరీలో బస కల్పిస్తామన్నారు.

నూతన జంటకు మ్యారేజ్ టికెట్

బంగారు ఆభరణాల దాతలకు అందుబాటులో ఉండేలా మరో గోల్డ్ అప్రైజర్ ను నియమించాలని పాలకమండలిని నిర్ణయించింది. ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పాలకమండలి ఛైర్మన్ తెలిపారు. దుర్గగుడిలో పెళ్లి చేసుకున్న నూతన జంటకు మ్యారేజ్ టికెట్ ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దుర్గా ఘాట్ ను అతి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేసి విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. అమ్మవారి సేవలకు ప్రచారం కల్పించేందుకు ఏపీ ఫైబర్ నెట్ అంగీకరించిందన్నారు.

దుర్గగుడి కోసం ప్రత్యేక ఛానల్

టీటీడీ ఎస్వీబీసీ తరహాలో విజయవాడ దుర్గగుడికి ఎస్‌డీఎంబీసీ ఛానల్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. రెండు వేల మంది ఒకేసారి అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవనం ఏర్పాటు చేయాలని దుర్గగుడి పాలక మండలి నిర్ణయించింది.

Whats_app_banner