Cyber Crime : లైక్ కొట్టినందుకు రూ.23 లక్షలు హంఫట్, సైబర్ నేరగాళ్ల నయా దోపిడీ!-vijayawada cyber crime man cheated rs 23 lakh when clicking like in telegram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyber Crime : లైక్ కొట్టినందుకు రూ.23 లక్షలు హంఫట్, సైబర్ నేరగాళ్ల నయా దోపిడీ!

Cyber Crime : లైక్ కొట్టినందుకు రూ.23 లక్షలు హంఫట్, సైబర్ నేరగాళ్ల నయా దోపిడీ!

Bandaru Satyaprasad HT Telugu
Aug 26, 2023 03:23 PM IST

Cyber Crime : తాము పంపిన లింక్ ఓపెన్ చేసి లైక్ లు కొడితే డబ్బులు ఇస్తామని చెప్పి, లక్షల్లో దోచేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సైబర్ క్రైమ్
సైబర్ క్రైమ్ (Unsplash)

Cyber Crime : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షలు కొట్టేస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... కొందరు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక.. అంతా లైక్ లు, షేర్స్ పై అంటూ యువత పరుగులు పెడుతున్నారు. సరిగ్గా దీనిని క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ తరహా మోసం జరిగింది. టెలిగ్రామ్ యాప్ లో మెసేజ్ లకు లైక్ లు కొడితే డబ్బులిస్తామని లక్షలు దోచేశారు.

అసలేం జరిగింది?

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లికి చెందిన రవి కిషోర్‌ అనే యువకుడికి జులై 31న టెలిగ్రామ్‌లో ఓ మెసేజ్ వచ్చింది. తాము పంపిన మెసేజ్ కు లైక్ కొడితే డబ్బులు ఇస్తామని అని ఉంది. దానికి స్పందించిన యువకుడు మెసేజ్ పంపిన వారితో డచ్ లోకి వెళ్లాడు. సైబర్ నేరగాళ్లను గుడ్డిన నమ్మిన యువకుడు తనకు వచ్చిన లింక్ ఓపెన్ చేసి లైక్ కొట్టాడు. మొదటిసారి యువకుడికి రూ.150 వేశారు. ఆ తర్వాత తమ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని యువకుడ్ని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన యువకుడు దాదాపు రూ. 23 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంకా డబ్బు పంపమని చెప్పడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసం

ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని పార్ట్ టైం జాబ్స్‌ కోసం ఉద్యోగార్థులు వెతుకుతుంటారు. ఓ సైబర్ ముఠా ఇలాంటి వారినే ఎక్కువగా టార్గెట్‌ చేస్తుంది. పార్ట్ టైమ్‌ జాబ్ పేరుతో లింకులు పంపిస్తూ మోసాలు చేస్తున్నారు. టెలీగ్రామ్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో లింక్‌లు పెడుతున్నారు. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే వాట్సాప్ అకౌంట్ కు కనెక్ట్ అయ్యేలా ఒక మెసేజ్‌ వస్తుంది. ఇందులో అమెజాన్‌లో వస్తువుల అమ్మకానికి సంబంధించిన ఓ లిస్ట్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెంచడమే ఈ ఉద్యోగం ఉద్దేశమని సైబర్ కేటుగాళ్లు నమ్మిస్తారు. దీన్ని నమ్మి మొబైల్ నెంబర్‌ ఇస్తే.. జాబ్ ప్రాసెస్ కోసం టెలీగ్రామ్‌ అకౌంట్ కు ఓ లింకుని పంపి రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. కొన్ని టాస్క్‌ లు ఇచ్చి వాటి కోసం రీఛార్జ్‌ అమౌంట్‌ కట్టమంటారు. ఆ టాస్క్‌ పూర్తి చేస్తే కమీషన్‌తో కలిసి రీఛార్జ్‌ అమౌంట్‌ తిరిగి చెల్లిస్తామని నమ్మిస్తారు. మొదటి రెండు లెవెల్స్ లో డబ్బు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత రీఛార్జ్‌ చేసుకున్న మొత్తంతో పాటు కమీషన్‌ అమౌంట్ ఫ్రీజ్‌లో ఉన్నట్టు చూపిస్తారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేలా చేస్తారు. ఇలా బాధితుల్ని ముంచేస్తారు.

Whats_app_banner