CM Jagan Stone Pelting Case : సీఎం జగన్ పై రాయిదాడి కేసులో నిందితుడికి సతీష్ కు విజయవా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచార సమయంలో నిందితుడు సతీష్ సీఎం జగన్ పై రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో సీఎం జగన్ కు నుదుటిపై గాయం అయ్యింది. ఈ కేసులో అరెస్టైన సతీష్ కు కోర్టు ముందుగా రిమాండ్ విధించింది. రిమాండ్ ముగియడంతో అతడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, వాదనలు అనంతరం విజయవాడ కోర్టు నిందితుడు సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శనివారం, ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు సతీష్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
సీఎం జగన్ పై రాయితో దాడి కేసులో ప్రధాన నిందితుడు వేముల సతీష్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఏప్రిల్ 13న అజిత్‌సింగ్ నగర్‌లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు సతీష్ ను అరెస్టు చేశారు. సతీష్ బెయిల్ పిటిషన్ పై మే 23న విజయవాడ పోలీసులు కౌంటర్ సమర్పించారు. సతీష్‌పై నమోదైన కేసు బలమైనదని, హత్య చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు వాదించారు. ఈ కేసుకు జీవిత ఖైదు సరైన శిక్ష అని వాదించారు.
కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసులో మరికొంత మంది సాక్షులను విచారించాల్సి ఉందని, డిజిటల్ సాక్ష్యాలను భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడి దర్యాప్తును అడ్డుకునే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. సతీష్ కు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సతీష్ కు నేర చరిత్ర ఉందని పోలీసులు తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే సతీష్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ తప్పుడు కేసు పెట్టి సతీష్ ను ఇరికించారని ఆరోపించారు. ఏప్రిల్ 17న అజిత్ సింగ్ నగర్ పోలీసులు సతీష్ అరెస్టు చేశారు. అప్పటి నుంచి సతీష్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడని సతీష్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నికల్లో సానుభూతి ఓట్లు పొందాలనే ఉద్దేశంతో వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని వాదించారు. ఈ కేసును బలపరిచేందుకు ఖాళీ కాగితంపై సతీష్ తో పోలీసులు బలవంతంగా సంతకాన్ని తీసుకున్నారని వాదించారు. బెయిల్ పిటిషన్ పై కోర్టు మంగళవారం తుది తీర్పు ఇచ్చింది. నిందితుడు సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సంబంధిత కథనం