CM Chandrababu : నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్- 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.50 వేల ఆర్థిక సాయం-vijayawada cm chandrababu good news to handloom weavers 200 units free power gst reimbursement ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్- 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.50 వేల ఆర్థిక సాయం

CM Chandrababu : నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్- 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.50 వేల ఆర్థిక సాయం

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2024 07:08 PM IST

CM Chandrababu : సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. నేతన్నలు కడుతున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ప్రకటించారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మగ్గాల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు.

నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

CM Chandrababu : నేతన్నలకు అండగా ఉండటానికి నెలకు ఒకసారి అందరం చేనేత వస్త్రాలు ధరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవం సందర్శంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... ముందుగా ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. తన సతీమణి భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొన్నారు. ప్రతి ఒక్క నేతన్న వద్దకు వెళ్లి, వారి కష్టాలు, ఎదురవుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దుర్గమ్మ తల్లి దీవెనలతో, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయని, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందన్నారు.

నెలకు ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలి

రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు ఓ విజ్ఞప్తి చేశారు. నేతన్నకు అండగా ఉండటానికి, నెలకు ఒకసారి అందరం చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపు నిచ్చారు. చేనేతపై వేస్తున్న జీఎస్టీ పన్ను ఎత్తివేసేలా కేంద్రంతో మాట్లాడతామన్నారు. చేనేతపై నేతన్నలు కడుతున్న జీఎస్టీని ఏపీ ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ప్రకటించారు. దీని కోసం రూ.67 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. గత ప్రభుత్వం, నేతన్నలకు అన్ని పథకాలు రద్దు చేసి, నెలకు రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఆ ఆర్థిక సాయం కూడా కేవలం మగ్గం ఉన్న వారికే ఇచ్చారన్నారు. చేనేతల రాయితీలు రద్దు చేశారని, చివరకు నేతన్నలకు కూడా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు.

"అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ నేతన్న కోసం నిలబడింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. గతంలో 24,300 చేనేత కుటుంబాలకు, 674 చేనేత స్వయం సహాయక బృందాలకు, 584 మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూర్చేలా రూ.116 కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసింది. నేత కార్మికులకు పట్టు, నూలు కొనుగోలుపై ఏడాదికి రూ.24000 రాయితీలిచ్చింది. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చింది టీడీపీ. మరమగ్గాలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో నేతన్నల ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాం"- సీఎం చంద్రబాబు

చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టం చేసేందుకు పోరాటం చేస్తామన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు అమలుచేస్తామన్నారు. చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. నేత కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు ఆధునిక శిక్షణ ఇప్పిస్తామన్నారు. నేతన్నలకు ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు. నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి తీసుకొస్తాం. మగ్గాల కోసం రూ.50 వేలు సాయం చేస్తామన్నారు. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ చేసుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. అలాగే మరమగ్గాల కార్మికులకు సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు.

సంబంధిత కథనం