Vijayawada : విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు, అర్ధరాత్రి కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే కఠిన చర్యలు
Vijayawada New Year Celebrations : విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవన్నారు. రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే చర్యలు తీసుకుంటామని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు.
Vijayawada New Year Celebrations : నూతన సంవత్సర వేడుకలు ఆమోదయోగ్యంగా, ఆహ్లాదకరంగా నిర్వహించుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు కోరారు. విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవన్నారు. రాత్రి 11 గంటల తరువాత వాహనాలు నడిపేవాళ్లు అతి వేగంగా, అజాగ్రత్తగా వెహికల్స్ నడపరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని ప్రధాన రహదారులు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీటీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.
హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు
డిసెంబర్ 31న వేడుకల పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రివేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందన్నారు. మద్యం సేవించి రోడ్లపై హంగామా చేసినా, అల్లర్లకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బైక్ ల సైలంసర్ తీసివేసి అధిక శబ్దాలు చేయడం, అతి వేగంతో రోడ్లపై తిరగటం, వాహనాలు నడుపుతూ విన్యాసాలు చేయడం, బాణాసంచా పేల్చడం వంటి చేయవద్దని సీపీ రాజశేఖర్ బాబు నగరవాసులకు సూచించారు.
కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే
డిసెంబర్ 31న రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే చర్యలు తీసుకుంటామని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు, కనక దుర్గా ఫ్లైఓవర్ల, వెస్ట్ బైపాస్ పై వాహనాలను అనుమతించమని సీపీ తెలిపారు. గుంపులుగా చేరి నడిరోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదని సూచించారు.
న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్న అమరావతి
కొత్త ఏడాది 2025కి ఘన స్వాగతం పలికేందుకు రాజధాని అమరావతి ప్రాంతం రెడీ అవుతోంది. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మతో పాటు ప్రముఖ సింగర్లు, నటి నటులు, జబర్దస్త్ కమెడీయన్లతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగనున్నాయి. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో న్యూ ఇయర్ ఈవెంట్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతిలో డిసెంబర్ 31 రాత్రి మొత్తం నాలుగు భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు ప్రైవేట్ వేదికలను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరులో జరిగే ఈవెంట్లలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్లు గీత మాధురి, మధు ప్రియ, నటి ముమైత్ ఖాన్ తో పాటు మరి కొందరు సినీ సెలబ్రిటీలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రాజధాని ప్రాంతంలోని పబ్‌లు, రిసార్ట్ లు, ఫామ్‌హౌస్ లు న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నాయి. పాపులర్ సింగర్లు, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినీసెలబ్రెటీలతో ఈవెంట్లు, విందులు, వినోదాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి న్యూ ఇయర్ పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.50 వేల పైనే పలుకుతుందని సమాచారం.
సంబంధిత కథనం