Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్, విచారణ రేపటికి వాయిదా
Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు రేపు తుది తీర్పు వెలువరించనుంది.
Chandrababu Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జైలు రిమాండ్ ను హౌస్ అరెస్టుకు మార్చాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మంగళవారం మరోసారి ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని, అందుకే హౌస్ రిమాండ్ మార్చాలని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.
ట్రెండింగ్ వార్తలు
చంద్రబాబుకు ప్రాణహాని
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని ఆయన తరఫున న్యాయవాది సిద్థార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అందువల్ల చంద్రబాబుకు హౌస్ కస్టడీ విధించాలని కోరారు. చంద్రబాబు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారన్న ఆయన... జైలులో భద్రతపై అనుమానం ఉందన్నారు. సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందన్నారు. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన వారు అదే జైల్లో ఉన్నారన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉన్న కారణంగానే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని కోర్టుకు తెలిపారు. హౌస్ రిమాండ్‌కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూథ్రా వివరించారు. హౌస్ రిమాండ్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ పిటిషన్ పై మంగళవారం తుది తీర్పు రానుంది.
జైలులోనే చంద్రబాబ సేఫ్
చంద్రబాబు హౌస్ రిమాండ్ పై సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైలులోనే సెక్యూరిటీ ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్న ఆయన.. జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామన్నారు. 24 గంటలూ పోలీసులు భద్రత కల్పిస్తున్నారని, జైలుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రత కల్పించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కల్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల చంద్రబాబును హౌస్ రిమాండ్ ఇవ్వొద్దని కోర్టును కోరారు.