Purandeswari : అదాన్, ఎస్పీవై ఆగ్రోస్ మద్యం డిస్టలరీస్ వెనుక విజయసాయి, మిథున్ రెడ్డి- పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
Purandeswari : మద్యం తయారీదారుల జాబితాను బయటపెట్టామని, వారిని అరెస్టు చేయగలరా అంటూ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ సన్నిహితుల కంపెనీల నుంచే రాష్ట్ర ప్రభుత్వం మద్యం సేకరిస్తోందన్నారు.
Purandeswari : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ప్రభుత్వానికి మరో సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న మద్యం డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి... ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ వద్ద 100కు పైగా డిస్టలరీ కంపెనీలు నమోదు చేసుకుంటే, కేవలం 16 కంపెనీల నుంచి 74 శాతం మద్యం తీసుకుంటున్నారని ఆరోపించారు. 2019లో స్థాపించిన అదాన్ డిస్టలరీస్ రూ.1164 కోట్ల మద్యం సరఫరాకు ఆర్డర్ పొందిందన్నారు. ఈ కంపెనీ వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని ఆరోపించారు. చింతకాయల రాజేశ్, పుట్టా మహేశ్ కు చెందిన కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ సంస్థకు రూ. 1800 కోట్ల మద్యం సరఫరా ఆర్డర్స్ ఉన్నాయన్నారు. సీఎం జగన్ సన్నిహుతులు పెర్ల్ డిస్టలరీస్ ను బలవంతంగా లీజుకు తీసుకున్నారన్నారు.
వారిని అరెస్టు చేస్తారా?
రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తున్న కంపెనీల జాబితా ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని పురందేశ్వరి ఆరోపించారు. ఇప్పుడు ఆ జాబితాను, కంపెనీ వివరాలు మేమే బయటపెడతామన్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్... మద్యం వ్యాపారులను ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని గుర్తుచేశారు. మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశామని, వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నిలదీశారు. మద్యం విక్రయాల్లో లెక్కల్లోకి రాని డబ్బు వివరాలు తేల్చాలన్నారు. మద్య నిషేధం చేయమని చెప్పి.... మద్యం ఆదాయంపై అప్పులు తెచ్చారని ఆరోపించారు. కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా మద్యం విక్రయాలు చేస్తున్నారంటే, అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ఫోరెన్సిక్ ఆడిట్ కు డిమాండ్
"ఏపీపై రూ.11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ప్రజలపై భారం మోపుతూ అప్పులు చేస్తున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాం. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.4.42 లక్షల కోట్ల అని పార్లమెంట్లో కేంద్రం చెప్పింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం బీజేపీ తప్పు చెప్పిందని ప్రచారం చేసుకుంది. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయమని కేంద్రాన్ని అభ్యర్థించాం. కార్పొరేషన్లు, రాష్ట్ర ఆస్తులు తాకట్టుపెట్టి తెచ్చిన అప్పులపై ఆడిట్ చేయాలని కోరాం. డిజిటల్ పేమెంట్స్ లేకుండా మద్యం అమ్మకాలు, నాణ్యత లేని మద్యం అమ్మకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కోరాం"- పురందేశ్వరి