YS Sharmila : విజయసాయిరెడ్డి రాజీనామా చిన్న విషయం కాదు, బయటకు వచ్చారు కాబట్టి నిజాలు చెప్పాలి- వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారన్నారు. సాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కోరారు.
YS Sharmila : విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామాపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని అన్నారు.

విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... విజయసాయి రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితులు, జగన్ ఏ పని ఆదేశిస్తే... ఆ పని చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడం సాయిరెడ్డి పని. వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి. ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పారు. ఇలాంటి జగన్ సన్నిహితులు రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు. వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలి' అని అన్నారు
విజయసాయిరెడ్డి నిజాలు చెప్పాలి
"జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు? ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు జగన్ ను వీడుతున్నారు? జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకుడిగా ప్రజలను, నమ్ముకున్న వాళ్లను మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేకపోతున్నారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడు. తనను తాను కాపాడుకోవడానికి విజయసాయి రెడ్డిని బీజేపీకి పంపారు.
ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వెళ్లిపోయారు. విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు కాబట్టే నిజాలు చెప్పాలి. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం. మిగతా విషయాలు కూడా బయట పెట్టండి"- వైఎస్ షర్మిల
విజయవాడ ధర్నా చౌక్ వద్ద పల్లెం, గరిటే పట్టుకొని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరసన తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్..సూపర్ ప్లాప్ అని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో వచ్చి 7 నెలలు అయింది, సూపర్ సిక్స్ కి దిక్కులేదని విమర్శించారు. హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందన్నారు.
అన్నదాత సుఖీభవ ఎప్పుడు?
"ఎన్నికలకు ముందు ఒక బ్రోచర్ రిలీజ్ చేశారు. రియల్ ఎస్టేట్ ప్రమోషన్ లా సూపర్ సిక్స్ బ్రోచర్ ను మిగిల్చారు. ఎన్నికలకు ముందు ఒడమల్లన్న....గెలిచాక బోడి మల్లన్న ఇదే చంద్రబాబు తీరు. ఇచ్చిన వాగ్దానాలకు విలువ లేకపోతే ఎలా? రైతులకు 20 వేలు ఇస్తాం అన్నారు. ఇప్పుడు కేంద్రానికి లింక్ పెట్టారు.
కేంద్రం రూ.10 వేలు ఇస్తే...రాష్ట్రం రూ.10 వేలు కలిపి ఇస్తారట. అన్నదాత సుఖీభవ...కానీ అన్నదాత సుఖంగా లేడు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం అన్నారు. ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ అన్నారు.4 గురు ఉంటే 60 వేలు అన్నారు. ఈ నాటికి విధివిధానాలు లేవు. 50 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు"- వైఎస్ షర్మిల
జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
'మహిళలకు మహాశక్తి పథకం పేరిట ప్రతి నెల రూ.1500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో కనీసం కోటి మంది మీద మహిళలకు ఈ పథకం ఇవ్వాలి. ఇప్పటి వరకు విధివిధానాలు లేవు. ఇలా అయితే మహిళలు మహాశక్తి ఎలా అవుతారు? రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు అన్నారు. నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ వన్. ఉద్యోగాలు లేక యువత లేని రాష్ట్రం గా ఉంది. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఉద్యోగాలు ఇచ్చే వరకు కనీసం భృతి ఇవ్వాలి కదా? నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని మోసం చేశారు. 2014 లో 2 వేలు అని చెప్పి మోసం చేశారు. ఎన్నికల్లో జనవరి 1 న జాబ్ క్యాలెండర్ అన్నారు. వైసీపీ మోసం చేసిందని చెప్పారు. జనవరి దాటి పోతుంది మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
తొలి సంతకానికే దిక్కులేదు
"సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ కి ఇంకా దిక్కులేదని వైఎస్ షర్మిల విమర్శించారు. 16 వేల టీచర్ ఉద్యోగాలు అన్నారు, 7 నెలలు గడిచినా దిక్కులేదన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాలంటీర్లకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని మోసం చేశారన్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణంపై దిక్కు దివాన లేదన్నారు. దసరా,దీపావళి, ఉగాది అని మహిళలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారని, చంద్రబాబు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అన్నీ తెలిసే హామీలు ఇచ్చారని విమర్శించారు" -వైఎస్ షర్మిల