Gidugu Rudraraju : మరో మణిపూర్ లా ఏపీ, మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు- గిడుగు రుద్రరాజు-vijayawada ap pcc chief gidugu rudraraju criticizes ysrcp govt not supports no confidence motion in parliament ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gidugu Rudraraju : మరో మణిపూర్ లా ఏపీ, మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు- గిడుగు రుద్రరాజు

Gidugu Rudraraju : మరో మణిపూర్ లా ఏపీ, మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు- గిడుగు రుద్రరాజు

Bandaru Satyaprasad HT Telugu
Jul 29, 2023 09:41 PM IST

Gidugu Rudraraju : కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. కేసుల మాఫీ కోసం సీఎం జగన్ మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు
పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

Gidugu Rudraraju : ప్రపంచ వ్యాప్తంగా మణిపూర్ గిరిజనులపై జరిగిన ఊచకోతపై నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమైన విషయం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ప్రశ్నించడం లేదన్నారు. పెత్తందారీ మనస్తత్వం ఉన్న సీఎం ఆధ్వర్యంలోని వైసీపీ ఒక ఫ్యూడల్ పార్టీ అని విమర్శించారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్ బయటకు వచ్చి బాధితుల తరఫున మాట్లాడకపోవడం గమనార్హం అన్నారు.

బీజేపీ బీ టీమ్ వైసీపీ

పార్లమెంట్ లో సుమారు 30 సభ్యులు బలం ఉన్న రాష్ట్రంలోని అధికార వైసీపీ... బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తుందని గిడుగు రుద్రరాజు ఆరోపించారు. బీజేపీ అడగకపోయినా తమంతట తాముగా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని ప్రకటించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా అభివర్ణించారు. స్వయంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వైసీపీ తమకు ఎందుకు మద్దతు ఇస్తుందో తెలియదని వారినే అడగమని చెప్పడం గమనార్హం అన్నారు. కేవలం కేసుల భయంతోనే సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. తన అక్కకు జరిగిన అన్యాయాన్ని అడిగినందుకు వైసీపీ మూకలు గుంటూరు జిల్లాలో ఒక బాలుడిని పొట్టన పెట్టుకున్నాయని, టమాటాల కోసం రైతును హత్య చేశారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులు గమనిస్తుంటే, మరో మణిపూర్ లా ఏపీ మారుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

అంతా బావుందని అడ్డగోలు వ్యాఖ్యలు

అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోగా అంతా బాగుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు మండిపడ్డారు. బీజేపీ కూడా ఇలా చెప్పలేదని తెలిపారు. ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచంలోని పలు దేశాలు మణిపూర్ లో గిరిజనులపై జరుగుతున్న మారణ కాండను ఖండిస్తున్నారని, వైసీపీ మాత్రం కేసుల భయంతో బీజేపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారని ఎద్దేవా చేశారు. అదే విధంగా ఎంతో పరిణితి ఉన్న సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, మరో ఎంపీ మార్గాని భరత్ లు కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మణిపూర్ లో గిరిజనులు, మైనారిటీ వర్గాలపై బీజేపీ చేసిన మారణహోమం ఏపీలో చేయరని గ్యారెంటీ ఏంటని రుద్రరాజు ప్రశ్నించారు.

మణిపూర్ మైనింగ్ కోసమే

మణిపూర్ లోని అత్యంత విలువైన ప్లాటినమ్, నికెల్, సున్నపురాయి, గ్రీన్ గ్రానైట్ వంటి విలువైన ఖనిజాలను అదానీ కంపెనీకి మైనింగ్ కోసం కట్టబెట్టేందుకే స్థానిక బీజేపీ ప్రభుత్వ సహాయంతోనే కుకీ గిరిజన తెగపై దాడులు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే స్పష్టం చేస్తున్నారని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీతో అంటకాగడం మైనింగ్ కోసమే అన్న అనుమానాలను పీసీసీ చీఫ్ వ్యక్తం చేశారు. వైసీపీలోని చాలా మంది కీలక నేతలకు మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అదానీ కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలు బహిరంగ రహస్యమే అన్న ఆయన, మణిపూర్ లో మైనింగ్ కోసం కూడా అవిశ్వాసానికి మద్దతు తెలపకుండా ఉండే అవకాశం ఉందన్నారు.

ప్రతిపక్షాలు కూడా

చరిత్రలో ఎన్నడూ చూడని దారుణాలకు సాక్షంగా నిలిచిన మణిపూర్ గిరిజనులకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపిన ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ చేస్తోన్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తన ఊగిసలాట ధోరణి వీడి బాధితుల పక్షాన నిలవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశం మొత్తం మణిపూర్ బాధితుల పక్షాన ఉందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదని ప్రత్యేక హోదాతో పాటు ఏది చేయాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని రుద్రరాజు స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024