Chandrababu Petitions : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టు కీలక నిర్ణయం-vijayawada acb court postpones hearing on chandrababu bail custody petition to tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Vijayawada Acb Court Postpones Hearing On Chandrababu Bail Custody Petition To Tomorrow

Chandrababu Petitions : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టు కీలక నిర్ణయం

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2023 03:51 PM IST

Chandrababu Petitions : చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం విచారించింది. ఇరువర్గాల వాదనల విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Petitions : స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్‌ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అలాగే సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను కోర్టు ఆదేశించింది. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. అంతకు ముందు చంద్రబాబు రెండు రోజుల కస్టడీ నివేదికను సీఐడీ అధికారులు సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. అనంతరం చంద్రబాబు విచారణకు సహకరించడంలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ముందుగా బెయిల్‌ పిటిషన్‌పై విచారించాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టును కోరారు. కస్టడీ పిటిషన్‌ను విచారించాలని సీఐడీ న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనల అనంతరం బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ మెన్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వద్ద లూథ్రా తెలిపారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడగగా, ఈ నెల 8న అరెస్ట్‌ చేశారని న్యాయవాది పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై రేపు మెన్షన్‌ లిస్ట్‌ చేసుకుని రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు. ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన తరఫు లాయర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు న్యాయవాదులు అందించారు. అయితే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని చంద్రబాబు అంతకుముందు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు తుది దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. నిన్నటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియడంతో... ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. దీంతో కోర్టు చంద్రబాబు రిమాండ్ ను అక్టోబరు 5 వరకు పొడిగిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తితో ఏకీభవించిన ఏసీబీ జడ్జి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp channel