Vijayasai Reddy : వివేకానంద రెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యా.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy : విజయసాయి రెడ్డి ఇష్యూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు. వివేకానంద రెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా ఘటనపై విజయసాయి రెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని వ్యాఖ్యానించారు. వెంటనే అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి అడిగానని.. అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని వెల్లడించారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు తనకు చెప్పారన్న విజయసాయి.. ఫోన్‌లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పానని స్పష్టం చేశారు.

జగన్‌తో మాట్లాడాకే..
శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి.. తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా. జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు' అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ద్రోహం చేయను..
'కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు. నేను దేవుడిని నమ్మాను. నమ్మక ద్రోహం చేయను. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా జగన్‌కు ప్రజాధరణ తగ్గదు. నా రాజీనామా పూర్తిగా వ్యక్తిగతం. రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. కేసుల మాఫీ కోసమే నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం నాకు ఉంది. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు. నా రాజీనామా వల్ల రాజ్యసభ సీటు.. కూటమికి వెళ్తుంది' అని విజయసాయి రెడ్డి వివరించారు.
మరో కేసు..
విజయసాయి రెడ్డి ఇప్పటికే జగన్ ఎదుర్కొంటున్న పలు కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ కేసు వ్యవహారంలోనే తాజా రాజకీయ పరిణామాలు జరిగి ఉంటాయనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. అనూహ్యంగా ఈ వ్యవహారంలో గతంలో జరిగిన క్రయవిక్రయాలు రద్దైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇది జరిగిన రెండు రోజులకే అనూహ్యంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు.
వ్యూహాత్మక ఎత్తుగడలు..
వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేయడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాజ్యసభలో బీజేపీకి ఎంపీల అవసరం ఉంది. కీలక బిల్లుల్ని నెగ్గించుకోవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామాలు చేస్తే ఏర్పడే ఖాళీలను బీజేపీ దక్కించుకోవచ్చు. సంఖ్యాబలం నేపథ్యంలో టీడీపీ- బీజేపీ కూటమికి అవి దక్కుతాయి. సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డితో పాటు మరో ఎంపీ కూడా రాజీనామా చేస్తారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.