Vijaya Sai PC: మహిళా అధికారిణి విషయంలో తనపై చేసిన దుష్ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళ విషయంలో తనపై అవాస్తవాలు, ఆధారాలు లేని ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై కొన్ని టీవీ ఛానళ్లు దుష్ప్రచారం చేశాయని, వార్తను ప్రసారం చేసే ముందు వారి వివరణ తీసుకోకుండా, ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేశారని, తన మీద దుష్ప్రచారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానన్నారు. తమ పార్టీ వారు కూడా కొంతమంది తనపై దుష్ప్రచారం చేశారన్నారు.
తాను కింద స్థాయి నుంచి జీవితంలో ఎదిగానని, 8ఎకరాల భూమి ఉన్న కుటుంబం నుంచి తాను జీవితంలో ఎదిగానన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి తాను వచ్చానని తనపై దుష్ప్రచారం చేసిన వాళ్లందరి జీవితాలు తనకు తెలుసన్నారు. బ్లాక్మెయిల్ చేసి తాను సంపాదించలేదని, వేంకటేశ్వరుడి సాక్షిగా తాను తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో అంతరాలు లేని సమాజం కోసం పనిచేస్తున్నానని చెప్పారు.
ఆదివాసీ మహిళతో సంబంధాన్ని అంటగట్టిన వారు వాటిని రుజువు చేయాలని, కుట్ర, కుతంత్రాల వెనుక ఎవరున్నారో అందరి సంగతి తెలుస్తానన్నారు. తన మీద దుష్ప్రచారం చేసిన వారందరి సంగతి తేలుస్తానన్నారు. తన మీద దుష్ప్రచారం చేసిన అందరికి బుద్ది చెబుతానన్నారు. యూ ట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా దుష్ప్రచారాలపై కూడా లీగల్ చర్యలు తీసుకుంటానన్నారు.
పార్లమెంటు సభ్యుడిగా తన హక్కుల్ని కాపాడుకోడానికి తనపై దుష్ప్రచారం చేసిన వారిపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్, పార్లమెంట్, నేషనల్ ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏపీ ఎస్టీ కమిషన్, డిఫమేషన్ కేసులు కూడా ఫైల్ చేస్తానని చెప్పారు. రాజ్యాంగ బద్దమైన సంస్థలన్నింటిలో తాను పోరాడతానన్నారు. ఆదివాసీ ఆడబిడ్డను బజారుకీడ్చిన వారందరిపై చర్యలు తీసుకుంటానన్నారు. సోషల్ మీడియాలో నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతానని సాయిరెడ్డి ప్రకటించారు.
2024 ఎన్నికల పరిణామ క్రమంలో ఓ పద్ధతి ప్రకారం ఎలా కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ ఓటమిపై సమీక్షించుకుంటున్నామని, దానిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు 175 స్థానాల్లో11 స్థానాలు తాము దక్కిన తర్వాత తాము అధికారం నుంచి తప్పుకున్నామని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన పార్టీ గుండాలు వైసీపీకి చెందిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ, కొడుతున్నారని, కుటుంబాలను హింసిస్తూ అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసుల మద్దతు ఉందనే అహంకారంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, కుటుంబాలను తరిమేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఇచ్చే ప్రజాస్వామ్య బద్ధమైన పరిపాలన ఇదేనా అని ప్రశ్నించారు. ఒక్క నెలలోనే రాక్షస పాలనను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.
వైసీపీ నాయకుల మీద బురద చల్లడం, క్రమబద్ధంగా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తన పేరు ప్రఖ్యాతలు దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారు ఎంతటి పెద్ద వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు.
ఆదివారం ఇద్దరు వ్యక్తులు మోటర్ సైకిల్ తమ ఇంటికి వచ్చారని, విజయసాయిరెడ్డి ఉన్నాడా పారిపోయాడా అని అడిగారని, టీడీపీ గుండా వచ్చి తన ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించాడని, తాను ఎక్కడికి పారిపోలేదని, టైమ్ చెబితే తాను ఒక్కడినే వెళ్తానని సవాలు చేశారు.
తాను తాటాకు చప్పుళ్లకు భయపడే వాడిని కాదన్నారు. తన ఇంటికి వచ్చిన వాడు టైమ్ చెబితే తానే వస్తానన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, తాము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదన్నారు. మళ్లీ ఐదేళ్లలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, మధ్యంతరం వస్తే మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్నారు. తోక జాడించే వారి తోకలు కత్తిరిస్తామన్నారు.
గతంలో తాను టీవీ ఛానల్ పెట్టాలని భావించానని, కానీ జగన్ వారించడంతో ఆగిపోయానని, ఇప్పుడు ఖచ్చితంగా న్యూట్రల్ చానల్ ఒకటి అతి త్వరలో తీసుకు వస్తానని సాయిరెడ్డి ప్రకటించారు.
తనపై ఆరోపణలు చేసిన మదన్‌మోహన్ రెండు సార్లు స్కాలర్‌షిప్ కోసం తన దగ్గరకు వచ్చాడని అంతకు మించి అతనితో ఎలాంటి పరిచయం కూడా లేదన్నారు. ఓ మీడియా ఛానల్ యజమానితో కలిసి అతను ఈ కుట్ర పన్నాడని, దీనిపై పార్లమెంటులో న్యాయపోరటం చేస్తానని ప్రకటించారు.
మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆదివారం రాత్రి స్పందించారు. 2013 నవంబర్ లో మదన్‌మోహన్‌తో తనకు పెళ్లి అయ్యిందని, తమకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని, 2015లో పిల్లలు పుట్టారని ఆమె వివరించారు. నేషనల్ ఓవర్ సీస్ స్కాలర్ షిప్ తాము ఇంటర్వ్యూ కి వెళ్ళామని, లా విద్యను అభ్యసిస్తుండగా మదన్ మోహన్ మానిపాటి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిగా ఉన్నాడని, పెళ్లైన తర్వాత అతను నన్ను దారుణంగా హింసించాడని ఆరోపించారు.
రెండేళ్ల పాటు తన భర్త దారుణంగా హింసించాడని ఆరోపించారు. భర్త వేధింపులు భరించలేక 201 లోనే తాము ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం విడాకులు రాసుకున్నామన్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు రాసుకున్నామని, 201 లో మదన్ మోహన్ యూఎస్ వెళ్ళిపోయాడని, 2020లో తనకు ఉద్యోగం వచ్చిందని, తాను, న్యాయవాది సుభాష్ ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అతని ద్వారా తాను మరో బిడ్డను కన్నట్టు చెప్పారు. సుభాష్ తల్లి సమ్మతంతోనే తమ పెళ్లి జరిగిందని, తన ఇద్దరు పిల్లలు, సుభాష్ కుమార్తెను కలిసి పెంచాలనే సమ్మతితో తమ పెళ్లి జరిగిందన్నారు.
సుభాష్ తో తన పెళ్లి జరిగిన తర్వాత కూడా వేధించారని ఆరోపించారు. మదన్ మోహన్, తాను విశాఖపట్నం కోర్టులో విడాకులు కి తీసుకున్నామని చెప్పారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లో చేరానని, గిరిజన మహిళ ని కాబట్టి నన్ను టార్గెట్ చేశారని, ఎంపీ విజయసాయిరెడ్డి ని నేను విశాఖపట్నం లోనే చూశానని చెప్పారు.
తండ్రిలాంటి సాయిరెడ్డిపై దుష్ప్రచారం చెయ్యడం అత్యంత దారుణమన్నారు. విజయసాయిరెడ్డి తో కేవలం డిపార్ట్ మెంటల్ విషయాలే మాట్లాడానని, ఏ ఆఫీసర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తో మాట్లాడకూడదా అన్నారు. ఆంధ్రజ్యోతి లో 100 కోట్లు సంపాదించాను అని రాశారని, అందుకు మదన్ మోహన్ నన్ను 75 కోట్లు అడిగారని, గిరిజన మహిళని అని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారన్నారు.
తన మీద పెట్టిన అభియోగాల్లో 8 అసలు తనకు సంబంధించినవే కాదని, ఇద్దరు అడబిడ్డలు ఉన్న తన వక్తిత్వ హననం చేశారని, మదన్ మోహన్ 2016లోనే తనకు విడాకుల ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడన్నారు. 2016 నుండి నేను మదన్ మోహన్ తో సంసారం చెయ్యలేదని, 30 కోట్లు కావాలని మదన్ మోహన్ డిమాండ్ చేసేవాడని మీడియా నా బిడ్డను అక్రమ సంతానం అనడం దారుణమని, సుభాష్ ను పెళ్ళి చేసకున్న తర్వాత బిడ్డ పుట్టాడన్నారు.
అడ్వకేట్ దగ్గర ఎంఓయూ రాసుకున్నప్పుడు కూడా మదన్ మోహన్ ఆ బిడ్డ తన బిడ్డ కాదని లిఖితపూర్వకంగా కూడా రాశాడని, ఆ తర్వాత తనను వేధించడంతో కేసు కూడా పెట్టానన్నారు. మదన్ మోహన్ అమెరికా అక్రమంగా వెళ్ళాడని, అతనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు కూడా నన్ను కొట్టేవాడని ఆరోపించారు.