AP election 2027 : 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి.. సమాయత్తం అవ్వండి : విజయసాయి రెడ్డి
AP election 2027 : దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ కూడా జమిలీ ఎన్నికలపై ఇటీవల కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను విస్మరించామన్న అపవాదు తొలగిపోవాలన్న విజయసాయి రెడ్డి.. కార్యకర్తలను ప్రాణంగా చూసుకోవాల్సిన బాధ్యత నేతలదేనని స్పష్టం చేశారు. చిత్తూరులోని 14 నియోజకవర్గాల గెలుపు బాధ్యత భూమనదేనని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వపై సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం చేశారు. సూపర్-6 హామీలు ఎక్కడా అమలు కాలేదు. ఐదు నెలల్లో రూ.53 వేల కోట్ల అప్పు చేశారు' అని సజ్జల విమర్శించారు.
'త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పటిష్టమైన కార్యకర్తలను పార్టీ సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే. కష్టపడి పనిచేస్తే.. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. కేసులు పెట్టినా ఎవ్వరూ వెనకడుగు వేయొద్దు. వైసీపీకి కార్యకర్తలదే. కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతున్నా.. ముదుకే సాగాలి. ఎక్కడా అధైర్యపడొద్దు' అని సజ్జల రామకృష్ణా రెడ్డి ధైర్యం చెప్పారు.
'వైసీపీ ఆధారం, మూలం, బలం కార్యకర్తలే. మోదీ, చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు. అధికార మదంతో వైసీపీని అణగదొక్కాలనుకుంటున్నారు. ఓవర్ యాక్షన్ చేసినవారిని వదిలిపెట్టేది లేదు. మూడు పార్టీలు కాదు.. 30 పార్టీలు కలిసి వచ్చినా.. వైసీపీ తగ్గేదే లేదు' అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
జమిలీ అసాధ్యం..
దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అసాధ్యమని తేల్చిచెప్పారు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం అవసరమని.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ఎన్డీఏ సర్కార్ దుందుడుకు నిర్ణయాలు సరికాదన్నారు. అయినా.. ప్రధాని మోదీ చెప్పింది ఎప్పుడూ చేయరని ఖర్గే సెటైర్లు వేశారు.
దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింధ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రముఖులు, మేధావులు, ప్రజాభిప్రాయం స్వీకరించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ.. నివేదిక అందించింది.