Weather Updates : ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు - ఇవాళ ఈ ప్రాంతాల్లో వర్షాలు
Cyclone Midhili Updates : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడగా… ఇవాళ బంగ్లాదేశ్ తీరంలో తీరం దాటింది. ఫలితంగా ఏపీకి తుపాన్ ముప్పు తప్పింది. ఇక పలు జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ.
Weather Updates : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపాన్ గా మారింది. అయితే రాత్రి సమయానికి బంగ్లాదేశ్ తీరంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితంగా ఇవాళ తుపాన్ మరింత బలహీనపడుతుందని పేర్కొంది. మరోవైపు దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో… ఏపీతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు బంగ్లాదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు:
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఏపీ తీర ప్రాంత వాసులతో పాటు మత్స్యకారులకు అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ రెండు మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇక తెలంగాణలో చూస్తే… ఇవాళ పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన లేదని పేర్కొంది. ఉదయం సమయంలో పొగ మంచు వాతావరణం ఉంటుందని పేర్కొంది.