AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం…చెన్నైకి 80,నెల్లూరుకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతం..సీమలోనేడు భారీ వర్షాలు
AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలను వణికిస్తోంది. చెన్నైకు 80, నెల్లూరుకు 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరించింది.
AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా 22 కిమీ వేగంతో కదులుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని చేరిన తర్వాత క్రమంగా బలహీనపడనుంది. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఐఎండి సూచనల ప్రకారం నైరుతి మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గడిచిన ఆరు గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతుందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం సాయంత్రానికి వాయుగుండం చెన్నైకి 190 కి.మీ., పుదుచ్చేరికి 250 కి.మీ, నెల్లూరుకి ఆగ్నేయంగా 270కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు.
గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తరువాత క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హోం మంత్రి అనిత సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తీవ్రతను బట్టి సూచనలు జారీ చేసారు. రేపు వాయుగుండం తీరం దాటిన తరువాత కుడా ఏటువంటి పరిస్థితులనైన ఎదుర్కోడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైన విద్యుత్ అంతరయం కలిగితే తక్షణం పునరుద్ధించడానికి పోల్స్, వైర్లతో విద్యుత్ సిబ్బంది రేడీగా ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుత వర్షభావ పరిస్థితులను బట్టి ప్రకాశంలో 4, నెల్లూరులో 10, అన్నమయ్య 4, అనంతపురం 2 తిరుపతిలో 14 మండలాల్లో భారీ వర్షాలు ఎక్కువ ప్రభావం చూపినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 827 మందిని సురక్షిత ప్రాంతాలకు, 2,222 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించారు. సముద్రంలో వేటకు వెళ్ళిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించారు.
నేడు భారీ వర్షాలు…
వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల కారణంగా ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు,కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రానున్న రెండు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు వివరించారు.
17 అక్టోబర్, గురువారం:
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
18 అక్టోబర్, శుక్రవారం:
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం సాయంత్రం 7 గంటల నాటికి తిరుపతి జిల్లా ఏర్పేడులో 97.7మిమీ, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో 82మిమీ, పుల్లంపేటలో 81మిమీ, తిరుపతి జిల్లా రేణిగుంటలో 71.5మిమీ, వెంకటగిరిలో 68.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 67.5మిమీ, నెల్లూరు రూరల్ లో 67మిమీ చొప్పున భారీ వర్షాలు నమోదైనట్లు తెలిపారు