Special Funds: మూడు జిల్లాల్లోకేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ-utilization of special funds of central government in three districts builders association explanation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Funds: మూడు జిల్లాల్లోకేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ

Special Funds: మూడు జిల్లాల్లోకేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుపై బిల్డర్స్ అసోసియేషన్ వివరణ

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 29, 2024 02:28 PM IST

Special Funds: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాల్లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగడంపై రాజకీయంగా దుమారం రేగింది. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించడంపై బిల్డర్స్‌ అసోసియేషన్ వివరణ ఇచ్చింది.

కేంద్రం నిధులతో కడప, కర్నూలు, చిత్తూరులో కొత్త రోడ్ల నిర్మాణం
కేంద్రం నిధులతో కడప, కర్నూలు, చిత్తూరులో కొత్త రోడ్ల నిర్మాణం

Special Funds: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడం రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయడం వెనుక మతలబు ఏమిటని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాయంపై బిల్డర్స్‌ అసోసియేషన్‌ వివరణ ఇచ్చింది.

కోవిడ్ తర్వాత రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టులకు 50ఏళ్ల నిడివితో నాలుగు శాతం వడ్డీలకు కేంద్రం అప్పులు ిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 'ప్రత్యేక సహాయం' కేటగిరీ లో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రాజెక్టులకు ఇటీవల బిల్లులు చెల్లించారు.

ఈ పథకంలో కేంద్రం నుంచి సహాయాన్ని పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే సమయానికి పూర్తైన కొత్త ప్రాజెక్టులు, 80-90శాతం పూర్తైన పనులను మాత్రమే మంజూరు చేస్తారు. పనులు పూర్తి చేసినా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు పూర్తి కావొచ్చిన పనుల బిల్లుల్ని ఇటీవల కేంద్రం విడుదల చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పనుల జాబితా ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల్ని ఇటీవల ఆర్థిక శాఖ చెల్లిస్తోంది.

2019-2020 ఆర్థిక సంవత్సరం నుండి 2023-2024 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక సాయంగా చేపట్టిన రోడ్లలో మూడు జిల్లాల్లోనే ఎక్కువ పనులు ఉన్నాయి. వాటిలో మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి చెందిన కడప జిల్లా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి చెందిన కర్నూలు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డికి చెందిన చిత్తూరు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్త రోడ్లను నిర్మించారు. ఇతర జిల్లాల్లో పనులు తక్కువగా మంజూరయ్యాయి. నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాటికి బిల్లుల్ని మంజూరు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సాయం పొందాలంటే పాత పనుల్ని పూర్తి చేసి ఉండాల్సి ఉండటంతో గతంలో చేసిన పనులకు నిధులు విడుదలైనట్టు చెబుతున్నారు. వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు కనిపిస్తున్నా NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, FIFO పద్ధతిలో బిల్లులను క్లియర్ చేస్తోందని బిల్డర్స్‌ అసోసియేషన్ స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే పనులు పూర్తైన వాటికి బిల్లులు మంజూరు అవుతున్నట్టు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంగా చేపట్టే రోడ్ల నిర్మాణంలో సాధారణ మెయింటెయినెన్స్‌ నిధులు ఉండవని ఆర‌్థిక శాఖ చెబుతోంది. కేవలం కొత్త రోడ్ల నిర్మాణానికి మాత్రమే కేంద్రం సాయం అందిస్తుందని చెబుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రమంతటా రోడ్లు గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడినా మూడు జిల్లాల్లో మాత్రమే కొత్త రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.