AP Agency Protests: ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్ని ఫ్రీ జోన్ చేయాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై దుమారం… పాడేరులో బంద్
AP Agency Protests: 1/70 చట్టాన్ని సవరించి ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్ని ఫ్రీ జోన్ చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అయ్యన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ 48 గంటల బంద్‌కు ఆదివాసీలు పిలుపునిచ్చారు. దీంతో ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం చేశారు.

AP Agency Protests: ఏజెన్సీ ప్రాంతాలను ఫ్రీ జోన్ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఏజెన్సీలో 48గంటల బంద్ పాటిస్తున్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీలో బంద్ చేస్తున్నారు.
పాడేరు ఏజెన్సీలో బంద్ జరుగుతోంది. గిరిజన హక్కులకు భంగం కలిగించేలా ఫ్రీ జోన్ చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్ సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా దుమారం రేగింది.
ఏజెన్సీ బంద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్ని వాయిదా వేశారు. మంగళవారం ఉదయం నుంచి వ్యాపార సంస్థల్ని మూసివేసి రాకపోకల్ని అడ్డుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. 1/70 చట్టాన్ని సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజనులు హెచ్చరించారు. పర్యాటక ముసుగులో గిరిజనుల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
1/70 చట్టాన్ని సవరించి అయా ప్రదేశాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. దీనిపై ఆదివాసీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతూ రెండు రోజుల ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులు, చట్టాల్ని గౌరవించాల్సిన స్పీకర్ వాటికి విరుద్ధంగా మాట్లాడటాన్ని తప్పు పట్టారు.
ఆదివాసీల ఆందోళనను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బహిరంగ ఆందోళనలకు అనుమతి లేదని చెబుతున్నారు. పాడేరు వద్ద ఆర్టీసీ బస్సుల్ని ఆందోళన కారులు అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో భారీగా పోలీసుల్ని మొహరించారు. మరోవైపు గిరిజన చట్టాలను సవరించే అవకాశం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనలు లేవని, 1/70 చట్టంపై ఆందోళన వద్దని సూచించారు.