నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్.. నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక!-update on the new railway line between nadikudi and srikalahasti ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్.. నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక!

నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్.. నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక!

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం.. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ (unsplash)

గుంటూరు - తిరుపతి మధ్య దూరాన్ని తగ్గించడం కోసం.. కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అదే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్. దీని పనులు వేగవంతం అయ్యాయి.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దర్శి, పొదిలి వరకు రైల్వే లైన్ పనులు ముగింపు దశకు వచ్చాయి. ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభం కావాల్సి ఉండటంతో.. పనులను వేగవంతం చేశారు.

3 స్టేషన్ల నిర్మాణం..

ఈ కొత్త లైన్‌లో భాగంగా.. కనిగిరి నియోజకవర్గంలో మూడు రైల్వే స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. యడవల్లి, కనిగిరి, గార్లపేట స్టేషన్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్.. ప్రకాశం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కోరిక. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని దర్శి, కనిగిరి, పొదిలి ప్రజలు ఈ రైలు మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కనిగిరి, పామూరు మీదుగా నెల్లూరు జిల్లాకు వెళ్తుంది. అటు నుంచి తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తి దగ్గర ముగుస్తుంది.

ప్రత్యామ్నాయ మార్గంగా..

విజయవాడ - గూడూరు - తిరుపతి మార్గంలో రద్దీని తగ్గించడం, వరదలు, తుపానుల సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ఉపయోగపడుతుందని అధికారులు వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 2011-12లో మంజూరు అయ్యింది. మొత్తం పొడవు 309 కిలోమీటర్లు. గుండ్లకమ్మ - దర్శి మధ్య 27 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించారు. పిడుగురాళ్ల - సావల్యాపురం (47 కి.మీ) సెక్షన్, గుండ్లకమ్మ - దర్శి (27 కి.మీ) సెక్షన్ పనులు పూర్తయ్యాయి.

బడ్జెట్‌లో నిధులు..

నెల్లూరు జిల్లాలో కూడా పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు, భూసేకరణపై దృష్టి సారించారు. 2024-25 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం రైల్వే శాఖ రూ.380 కోట్లు మంజూరు చేసింది. దర్శి - కనిగిరి (52 కి.మీ), వెంకటగిరి - ఆత్మకూరు (15 కి.మీ), కనిగిరి - పామూరు (35 కి.మీ), ఆత్మకూరు - వెంకటపురం (43 కి.మీ), పామూరు - ఒబులాయపల్లె - వెంకటపురం (90 కి.మీ) పనులు పూర్తవ్వాలి.

తగ్గనున్న ప్రయాణ సమయం..

నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. సికింద్రాబాద్ వైపు నుంచి తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు. ప్రస్తుతం సికింద్రాబాద్ వైపు నుంచి తిరుపతికి వెళ్లాలంటే మూడు రూట్‌లు ఉన్నాయి. వరంగల్, విజయవాడ మీదుగా ఒక మార్గం, నల్గొండ, గుంటూరు మీదుగా రెండో మార్గం, మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మూడో మార్గం ఉంది. ఈ మూడు రూట్లతో పోలిస్తే.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్‌తో దూరం తగ్గుతుందని చెబుతున్నారు.

సంబంధిత కథనం