SteelPlant Future: స్టీల్ ప్లాంట్‌కు భవిష్యత్ లేదన్న ఉక్కుశాఖ కార్యదర్శి సిన్హా
SteelPlant Future: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ప్లాంటు భవిష్యత్తుపై ఉక్కు శాఖ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లకు మించి స్టీల్ ప్లాంటుకు భవిష్యత్తు లేదని పేర్కొనడంపై కార్మికులు భగ్గుమంటున్నారు.
SteelPlant Future: విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిన్హా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్లాంటు పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి.. రెండేళ్ల తర్వాత విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జీవిత కాలం మరో రెండేళ్లేనని తాను భావిస్తున్నానంటూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా సందర్శకుల పుస్తకంలో రాసి సంతకం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
మంగళవారం విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాట్‌నిగమ్ లిమిటెడ్ స్టీల్‌ప్లాంట్ పర్యటనకు వచ్చిన సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు రాయడంతో కార్మికులు భగ్గుమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని చెప్పేలా అభిప్రాయాన్ని వెల్లడించారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఉక్కుశాఖ కార్యదర్శి వ్యాఖ్యలు తెలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. అడ్మిన్ భవనం ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. నినాదాలు, నిరసనలతో ప్లాంటు ప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 922 రోజులుగా కార్మికులు పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థానిక పరిస్థితులను కేంద్రానికి వివరించకుండా సందర్శకుల పుస్తకంలో ఈ విధంగా రాయడం ఏమిటని మండిపడ్డారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులుఅడ్మిన్ బిల్డింగ్‌లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులకూ, పోలీసులకూ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామంటూ కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని తెలిసి కార్మికులు మంగళవారం ఆందోళన నిర్వహించారు.
మరోవైపు ఉక్కుశాఖ కార్యదర్శి సిన్హాతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సమావేశమయ్యారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని కేంద్రం తన డిపిఆర్‌లో రాసుకుందని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఎక్కడ నుంచి స్టీల్ తెస్తుందని కార్మిక నేతలు ప్రశ్నించారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం 102 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతోందని, దేశ అవసరాలకు మరింత ఉత్పత్తి అవసరమని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌లో మూడో ఫర్నేస్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తే ప్లాంట్ వేల కోట్ల రూపాయల లాభాల్లోకి తెస్తామని చెప్పారు. రా మెటీరియల్ కోల్, ఐరన్ ఓర్ రైల్వే రేకులు కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో, కేంద్రం ఆధీనంలో ఉన్నాయని, వీటిని ఇస్తే రూ.36 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తామని వివరించారు.
ప్లాంటును సొంతంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులు వేతనాలు పెరగక అవస్థలు పడుతున్నారని వివరించారు. కార్మిక సంఘాలతో చర్చలు అనంతరం నాగేంద్రనాథ్ సిన్హా మాట్లాడుతూ స్టీల్ ప్లాంటులో నెలకొన్న పరిస్థితులు, ప్లాంటు బలాలు, బలహీనతలను కేంద్రానికి తెలియ జేస్తానన్నారు. ముడి పదార్ధాలను సమకూర్చుకోవడంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు.