BJP On SteelPlant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌కు అప్పగించేది లేదన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
BJP On SteelPlant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌కు అప్పగించేది లేదని కార్మికుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్నదే తన సంకల్పమన్నారు.
BJP On SteelPlant: స్టీల్ ప్లాంట్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, స్టీల్ ప్లాంట్ ను సెయిల్ కు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర మంత్రి స్పందించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడటమే తన సంకల్పం అని మంత్రి వివరించారు.

తీవ్ర ఆర్థిక పరమైన నష్టాలతో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీగా ప్యాకేజ్ ఇచ్చిందని, రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద , రూ. 1140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కు కేటాయించినట్టు చెప్పారు.
ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మినహాయించి, ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్ర ప్యాకేజీ ప్రకటించినట్టు వివరించారు. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ అని వివరించారు. కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి సాధించే అవకాశం కలిగినందుకు ఆంధ్రుడిగా గర్విస్తున్నట్టు చెప్పారు.
దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే మోదీ లక్ష్యమని, ప్యాకేజీ ఇచ్చాక కూడా సమర్ధవంతంగా స్టీల్ ప్లాంట్ నడపకపోతే కేంద్ర నిర్వహణ లోపంగానే భావించి, అభివృద్ధి లోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు మాత్రమే రూ.230 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల బకాయి జీతాలు చెల్లిస్తామని చెప్పారు.
ప్రైవేటీకరణ ప్రకటించాక కూడా వెనక్కు తగ్గారని, భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30 వేల కోట్ల అప్పు ఉన్న స్టీల్ ప్లాంట్ కు మొత్తం రూ.13 వేల 90 కోట్లు ప్యాకేజీ ఇచ్చినా కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయబరేలి లో అనవసర పెట్టుబడులు పెట్టీ రూ.2100 కోట్లు గత ప్రభుత్వం నష్టం చేయడం వల్లే స్టీల్ ప్లాంట్ కు నష్టాలొచ్చాయన్నారు. మరో భారీ ప్యాకేజీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు భవిష్యత్ లో ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారని, ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్ ను సందర్శించి, ఒకరోజు రాత్రి బస కూడా చేసి ఉద్యోగులు, కార్మికులు అందరితో చర్చలు జరిపామన్నారు.
కేంద్రం ప్రభుత్వంలో ఉంటూ అన్నీ బహిరంగంగా చెప్పలేమని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని స్పష్టం చేశారు. సెయిల్ లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం అనేది జరగదు, స్టీల్ మంత్రిగా నేను చెప్తున్నానని వివరించారు. నష్టాల్లో ఉన్న కంపెనీ ను సెయిల్ వారు విలీనం చేయమని అభ్యంతరం వ్యక్తం చేశారని, నష్టాల నుండి బయటకు తీసుకొచ్చాక మేనేజ్ మెంట్ అప్పగించమని సెయిల్ చెప్పిందన్నారు.
ఈ నెలాఖరు లోగా ముడిసరుకు తీసుకొచ్చి, ఉత్పత్తి ప్రారంభించి, ఆగస్ట్ నెలాఖరుకి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్ ను నష్టాల బాటలోంచి లాభాల బాటలోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు.
కాంగ్రెస్ నేత షర్మిల ఏమి మాట్లాడుతుందో ఆమెకు స్పష్టత లేదని, విశాఖ స్టీల్ కు సొంత గనులు లేకనే నష్టాలు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయని, సొంత గనులు లేకపోయినా వైజాగ్ స్టీల్ లాభాల్లో నడిచిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలోని జిందాల్, jsw వంటి ప్లాంట్ లకు కూడా సొంత గనులు లేకున్నా, లాభాల్లో ఉన్నారన్నారు. సొంత గనులు ఉంటే నష్టాలు రావనేది వాస్తవం కాదన్నారు.