Tirumala : తిరుమలలో వరుస ఘటనలు - సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..!-union home ministry additional secretary sanjeev kumar jindal is visiting tirumala for two days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో వరుస ఘటనలు - సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..!

Tirumala : తిరుమలలో వరుస ఘటనలు - సమీక్షకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ..!

HT Telugu Desk HT Telugu
Jan 19, 2025 08:13 AM IST

తిరుపతి తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ తిరుమలకు రానున్నారు. సమీక్ష కు ఏర్పాట్లు చేయాలని టీటీడీకి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి చెన్నై నుంచి ఇవాళ రాత్రే తిరుపతి రానున్నారు.

తిరుమల తొక్కిసలాట ఘటన
తిరుమల తొక్కిసలాట ఘటన

తిరుమలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కేంద్ర హోంశాఖ సీరియస్ గా పరిగణించింది. తాజాగా జరిగిన తొక్కిస‌లాట, అగ్నిప్ర‌మాదంపై వంటి ఘటనలపై స‌మీక్షించేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్యద‌ర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ఇవాళ(ఆదివారం) తిరుప‌తికి రానున్నారు.

రేపు సమీక్ష…!

సోమ‌వారం ఆయ‌న టీటీడీ అధికారుల‌తో స‌మావేశం అవుతారు. ఈ మేర‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి. ఆర్ నాయుడుకి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్ వి.గ‌వాయి లేఖ రాశారు. జనవరి 8న జరిగిన తొక్కిసలాట, జనవరి 13న అగ్నిప్రమాదం ఘటనలు టీటీడీ ఆలయ సముదాయంలో సంభవించాయని లేఖ‌లో పేర్కొన్నారు. జనసమూహ నియంత్రణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి కేంద్ర‌ ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (విపత్తు నిర్వహణ) సంజీవ్ కుమార్ జిందాల్ ఈనెల 20న (సోమ‌వారం) సమావేశం నిర్వహిస్తారని లేఖలో ప్రస్తావించారు.

సంజీవ్ కుమార్ జిందాల్ ఆదివారం(జనవరి 19) రాత్రి 8 గంటలకు తిరుప‌తి చేరుకుంటార‌ని లేఖలో తెలిపారు. రైలు నంబర్ 20678 ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆయ‌న తిరుపతికి చేరుకుంటారు. సంజీవ్ కుమార్ జిందాల్‌కు రవాణా, వసతి ఏర్పాట్లు చేయాలని లేఖ‌లో కోరారు.

జ‌న‌వ‌రి 8న వైకుంఠ ఏకాద‌శి రోజున శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌నుకునే వారు ఎస్ఎస్‌డీ టోకెన్ల‌ను తీసుకునేందుకు వెళ్లే క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. చాలా మంది తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రి పాలు అయ్యారు. తిరుప‌తిలో 8 కేంద్రాల్లో 90 కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలోని, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భ‌క్తులు బారులు తీరారు. అయితే ఒక్క‌సారి గేటు ఓపెన్‌చేసే స‌రికి భ‌క్తులు టోకెన్ల కోసం ఎగ‌బ‌డ్డారు. దీంతో తొక్కిస‌లాట జ‌రిగింది.

ఇక జ‌న‌వ‌రి 10న టీటీడీలో లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ముఖ్యంగా తిరుమ‌ల‌లోని ప్ర‌సాదం పంపిణీ చేసే ప్ర‌దేశంలో 47వ కౌంట‌ర్ వ‌ద్ద ఉన్న కంప్యూట‌ర్ సిస్ట‌మ్ నుంచి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే అక్క‌డి సిబ్బంది ఫైర్ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. అప్ప‌టికే అక్క‌డ షార్ట్ స‌ర్య్కూట్ అయి మంట‌లు చేల‌రేగాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు ఆ ప్రాంతంలో విస్త‌రించాయి. దీంతో టీటీడీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను నిలువ‌రించారు.

హైకోర్టులో విచారణ:

తిరుపతిలో తొక్కిసలాట, భక్తుల మృతిపై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శిని, రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఈ కేసులో ప్ర‌తివాదులుగా చేర్చ‌డంపై ఏపీ హైకోర్టు అభ్యతరం వ్య‌వ‌క్తం చేసింది. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు వారు ఎలా బాధ్యుల‌వుతార‌ని ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఇత‌ర అధికారులు ప్ర‌తివాదులుగా ఉన్నార‌ని హైకోర్టు తెలిపింది.

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శిని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి పేర్ల‌ను ప్ర‌తివాదుల జాబితా నుంచి తొల‌గించాల‌ని పిటిష‌న‌ర్‌ను ఆదేశించింది. రిజిస్ట్రీ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌కు క‌ట్టుబ‌డి త‌ద‌నుగుణంగా పిటిష‌న్‌లో స‌వ‌ర‌ణ చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు స్ప‌ష్టం చేసింది. విచారణను వ‌చ్చే బుధ‌వారం (జ‌న‌వ‌రి 22)కి వాయిదా వేస్తూ జ‌స్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ కుంచం మ‌హేశ్వ‌ర‌రావుతో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీచేసింది.

 

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం