AP TG Police Medals : పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్రహోంశాఖ- ఏపీకి 2, తెలంగాణకు 14
AP TG Police Medals : 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం ప్రకటించిన పోలీస్ మెడల్స్ లో ఏపీకి రెండు, తెలంగాణకు 14 మెడల్స్ వచ్చాయి.
AP TG Police Medals : 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన పోలీస్ మెడల్స్ లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు, తెలంగాణకు 14 పతకాలు వరించాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, కరక్షనల్ సర్వీస్‌లకు చెందిన మొత్తం 942 మందికి మెడల్స్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 95 మందికి గ్యాలంటరీ మెడల్స్, 101 మందికి విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పతకాలు (పీఎస్ఎం), 746 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(ఎంఎస్ఎం) పతకాలు ప్రకటించింది.

ముఖ్యంగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్లలో కీలక పాత్ర పోషించిన పోలీసులు, పారా మిలటరీ బలగాలు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగస్వామ్యం అయిన కేంద్ర బలగాలకు గ్యాలంటరీ మెడల్స్‌ను ప్రకటించింది. మొత్తం 95 గ్యాలంట్రీ మెడల్స్ ప్రకటించగా... అందులో 28 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, 28 మంది జమ్మూ కాశ్మీర్‌లో పని చేసిన వారు ఉన్నట్లు ప్రత్యేకంగా పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌కు రెండు మెడల్స్
ఆంధ్రప్రదేశ్‌కు రెండు కరెక్షనల్ మెడల్స్ దక్కాయి. చీఫ్ హెడ్ వర్డర్ కడలి అర్జున రావు, వర్డర్ వీర వెంకట సత్యనారాయణలకు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(ఎంఎస్ఎం)లను కేంద్రం ప్రకటించింది.
తెలంగాణకు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఇద్దరికి విశిష్ట సేవ రాష్ట్రపతి పతకాలు(పీఎస్ఎం), 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(ఎంఎస్ఎం) లు దక్కాయి. ఇందులో కమిషనర్ విక్రంసింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి. అలాగే ఐజీ కార్తికేయ, ఎస్పీ అన్నల ముత్యంరెడ్డి, డీసీపీలు కమాల్ల రాంకుమార్, మహమ్మద్ ఫజ్లుర్ రహమాన్, డీఎస్పీలు కోటపాటి వెంకట రమణ, అన్ను వేణుగోపాల్, ఏఎస్ఐలు రణ్‌వీర్ సింగ్ ఠాకూర్, పీటర్ జోసెఫ్ బహదూర్, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లు విదత్యా పాథ్యా నాయక్, ఎండి అయూబ్ ఖాన్ లకు మెరిటోరియస్ అవార్డులు వచ్చాయి. అలాగే సీబీఐలో జాయింట్ డైరక్టర్‌గా ఉన్న దాట్ల శ్రీనివాస వర్మకు పోలీసు మెడల్ ను కేంద్రం ప్రకటించింది.
ఫైర్ సర్వీస్‌లో
ఫైర్ సర్వీస్ లో ముగ్గరికి, హోంగార్డ్/ సివిల్ డిఫెన్స్ లో నలుగురికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(ఎంఎస్ఎం) దక్కాయి. ఫైర్ డిపార్ట్మెంట్ లో లీడింగ్ ఫైర్ మెన్‌లు ఎం. వెంకటేశ్వర రావు, సుబ్బయ్య చవల, జనార్థన్ కొరుకూరిలకు, హోం గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్‌లో హోంగార్డులు మంత్రి ఈశ్వరయ్య, యాదగిరి మేడిపల్లి, లక్ష్మణ్ కోమటి, ఐలయ్య కల్లెంలను ఈ మెడల్స్ వరించాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు