Amit Shah : గత ప్రభుత్వ విధ్వంసానికి చింతించకండి, ఏపీ అభివృద్ధికి మోదీ అండదండలు- అమిత్ షా
Amit Shah : గత ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసి అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయన్నారు.
Amit Shah : విజయవాడ, కొండపావులూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సదరన్ క్యాంపస్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ పునరంకితమై ఉంటుందని స్పష్టం చేశారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసి అభివృద్ధి పట్ల తమ చిత్తసుద్ధిని నిరూపిస్తుందని అన్నారు.

2019-24 మధ్య ఏపీలో జరిగిన అనేక మానవ తప్పిదాలు అభివృద్ధిపై ప్రభావం చూపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పుడెప్పుడే ఏపీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎలా ప్రజలను కాపాడుతుందో....ఎన్డీఏ కూటమి కూడా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటుందన్నారు. విశాఖలో ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన గ్రీన్ హైడ్రోజన్ హబ్, అమరావతిలో ఎయిమ్స్ విస్తరణ ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధికి కీలకమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతికి కేంద్రం రూ. 27,000 కోట్లను అందించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ఆర్థికంగా సుస్థిరంగా మారుతుందన్నారు.
ఏపీ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశామని అమిత్ షా అన్నారు. రైల్వే జోన్ రాష్ట్ర రవాణా వ్యవస్థకు నూతన శక్తిని అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తన బాధ్యత అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్డీయే ఎప్పుడూ మీతో ఉంటుందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏవిధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి... ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామన్నారు.
"ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు రూ.3 లక్షల కోట్ల సహకారం అందించాం. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు అందించనున్నాం. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్‌ప్లాంట్ ను మందుకు తీసుకెళ్తాం. వైసీపీ ప్రభుత్వం అమరావతిని బుట్టదాఖలు చేసింది. హడ్కో ద్వారా అమరావతికి రూ.27 వేల కోట్ల సాయం అందించనున్నారు. పోలవరంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తున్నాం. 2028లోపు పోలవరం ద్వారా నీళ్లు అందిస్తారం" - అమిత్ షా
"కేంద్ర సహకారంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడింది.. ఇంకా కోలుకోలేదు. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ పనులు మొదలయ్యాయి. కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థికసాయం చేసి ప్రాణం పోసింది. ఇటీవల విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలి. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కోసం నాడు భూములు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. నేడు కేంద్ర సహకారంతో అవి పూర్తి చేశాం" -సీఎం చంద్రబాబు
"గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు చేస్తాం. అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ ఇస్తాం. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం. సమష్టిగా పోరాడి... గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం. గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది" - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సంబంధిత కథనం