Visakhapatnam Division : విశాఖపట్నం కేంద్రంగా 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' - కేంద్ర కేబినెట్ ఆమోదం
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసింది. ఇక వాల్తేరు పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.

వాల్తేరు రైల్వే డివిజన్ ను కుదించి విశాఖపట్నం డివిజన్ గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే….
ఈ నిర్ణయంతో వాల్తేర్ డివిజన్‌లో భాగమైన పలాస–విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు – విజయనగరం, నౌపాడ జంక్షన్ – పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్– సాలూరు, సింహాచలం నార్త్ –దువ్వాడ బైపాస్, వడ్లపూడి – దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయపాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు ఇకపై సౌత్ కోస్ట్ రైల్వే కిందికి రానున్నాయి. విశాఖపట్నం డివిజన్‌లో కొనసాగుతాయని ప్రకటించింది.
కొత్తగా రాయగడ డివిజన్ …..
ఇప్పటివరకు వాల్తేర్ డివిజన్‌లో భాగమైన కొత్తవలస – బచేలి, కూనేరు – తేరువలి జంక్షన్, సింగాపుర్ రోడ్– కోరాపుట్, పర్లాకిమిడి – ఘన్‌పూర్ (సుమారు 680 కి.మీ) విభాగాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ డివిజన్‌లో ఉంటాయని కేంద్రం వెల్లడించింది.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను 2019 ఫిబ్రవరి 28న కేబినెట్ ప్రతిపాదించింది. కానీ ఆ తర్వాత వేగంగా అడుగులు పడలేదు. ఇటీవలే ఫిబ్రవరి 5వ తేదీన విశాఖపట్నం జోన్ పరిధి నిర్ణయిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వాటిని తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
విశాఖపటనం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లు కేంద్ర రైల్వే శాఖ అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు కారణంగా రైల్వే కార్యకలాపాలు పెరుగుతాయని వివరించారు. అనుసంధానం పెరుగుతుందన్నారు. అలాగే వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్పు చేసినట్లు ప్రకటించారు.
సంబంధిత కథనం