Union Budget 2025-26 : పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులివే
Union Budget 2025-26 : కేంద్ర బడ్జెట్ లో ఏపీ కేటాయింపులపై స్పష్టత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
Union Budget 2025-26 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం కేంద్ర బడ్జెట్ రూ.50,65,345 కోట్లు ఉండగా, రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు, పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోదీ ప్రభుత్వంలో కీలకంగా మారిన ఏపీ, బీహార్ కేటాయింపులో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికల దృష్ట్యా మోదీ సర్కార్ బీహార్ వైపే మొగ్గుచూపుందని నిపుణులు అంటున్నారు.

ఏపీకి కేటాయింపులు
కేంద్ర బడ్జెట్ 2025-26లో ఏపీ కేటాయింపులపై స్పష్టత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్ల కేటాయింపులు చేసింది. దీంతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు.
బడ్జెట్ లో ఏపీని నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో బీహార్ పై వరాల జల్లు కురిపించి, ఏపీని నిర్లక్ష్యం చేశారని కేంద్రాన్ని విమర్శించారు.
“బీహార్ కు భారీ ప్రకటనలు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నందున ఇది సహజమే. కానీ ఎన్డీఏలోని మరో స్తంభం అయిన ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు ఇంత దారుణంగా విస్మరించారు” -జయరాం రమేష్
నిధులు రాబట్టేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఏపీకి రానున్న నిధులకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్థికశాఖ సూచించింది. అన్ని శాఖల సమాచారం అందిన వెంటనే సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక సమర్పించనుంది. ఏపీలో నదుల అనుసంధానానికి కేంద్రాన్ని నిధులు కోరింది.
తుపానులు, రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతంతో పాటు, రాష్ట్ర విభజనతో ఏపీకి భారీగా నష్టం జరిగిందని కేంద్రానికి తెలిపింది. ఏపీకి కేంద్ర ప్రయోజిత పథకాల్లో 90 శాతం నిధులు వచ్చేలా ఆర్థిక శాఖను కోరింది. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కావాల్సిన నిధులు రాబట్టేంందుకు కేంద్రాన్ని కోరాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.